సమస్యలు పరిష్కరించని చంద్రబాబు సర్కారు | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించని చంద్రబాబు సర్కారు

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

సమస్యలు పరిష్కరించని చంద్రబాబు సర్కారు

వీఆర్‌ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బందగీ సాహెబ్‌ నేడు పల్నాడు కలెక్టర్‌ కార్యాలయం వద్ద సామూహిక రాయబారం

నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని, అందువల్ల గురువారం కలెక్టర్‌కు సామూహిక రాయబార కార్యక్రమం నిర్వహిస్తున్నామని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బందగీ సాహెబ్‌ పేర్కొన్నారు. బుధవారం కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల ముఖ్య మండల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా బందగీ సాహెబ్‌ మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా వీఆర్‌ఏలకు జీతాలు పెరగలేదని, పక్క రాష్ట్రాలలో వీఆర్‌ఏలకు పే స్కేలు అమలు చేస్తున్నా మన రాష్ట్రంలో జీతాలు పెంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుందన్నారు. అధికారులు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. చదువుకున్న వీఆర్‌ఏలు ఎప్పటికై నా ప్రమోషన్‌ వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం మాత్రం ప్రమోషన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులను వన్‌ టైం సెటిల్మెంట్‌ ద్వారా భర్తీ చేయాలని, ప్రభుత్వం వీఆర్‌ఏల రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. గురువారం జరిగే కలెక్టర్‌కు సామూహిక రాయబార కార్యక్రమంలో వీఆర్‌ఏలు అందరూ పాల్గొని, తమ గళం వినిపించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సంఘం సత్తెనపల్లి మండల అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి మునాఫ్‌, క్రోసూరు మండల అధ్యక్షుడు డేవిడ్‌, దుర్గి మండలం అధ్యక్షుడు వెంకటేష్‌, నరసరావుపేట, పెదకూరపాడు మండల అధ్యక్షుడు రోశయ్య, కొండలు, ప్రధాన కార్యదర్శి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement