తాగునీరు ఇవ్వరు గానీ ఊరూరా సారా ఏరులై పారిస్తారా? | - | Sakshi
Sakshi News home page

తాగునీరు ఇవ్వరు గానీ ఊరూరా సారా ఏరులై పారిస్తారా?

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

తాగునీరు ఇవ్వరు గానీ ఊరూరా సారా ఏరులై పారిస్తారా?

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

వినుకొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వినుకొండలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం రూ.500 కోట్లతో పూర్తయ్యే వరికపూడిశెల ప్రాజెక్టును క్యాబినెట్‌ పూర్తిగా విస్మరించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు కేవలం అమరావతి, పోలవరం జపమే చేస్తున్నారన్నారు. ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం, ఊరూరా బెల్ట్‌ షాపులు పెంచి మద్యం ఏరులై పారిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాడుడే బాదుడు అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. 35 శాతం వ్యాట్‌ ట్యాక్స్‌తో ప్రజల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. అసలే ద్రవ్యోల్బణం పెరిగి, నిరుద్యోగం తాండవిస్తుంటే ముగ్గురు, నలుగురు పిల్లలను కనమనడం హాస్యాస్పదమని చెప్పారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఒక్కొక్కరినే కన్నారు... మరి ప్రజలకు ఈ ఉచిత సలహాలెందుకని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం దళితులు క్రైస్తవంలోకి మారింత మాత్రాన వారి కుల సర్టిఫికెట్లను రద్దు చేయడం తగదని, వారికి సీపీఐ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతీవరప్రసాద్‌, నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, రైతు సంఘం నేత ఉలవలపూడి రాము పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement