పక్కా పన్నాగంతో అక్రమార్కులు సిద్ధం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పచ్చనేత చీరాల బడాబాబు, కొత్తపేట వస్త్ర వ్యాపారులే కీలకం వెనక్కు తగ్గిన గుంటూరు టీడీపీ నేత ఈపురుపాలెం మాదిరిగా వేటపాలెం స్ట్రయిట్ కట్ మార్పునకు వ్యూహం రూ.100 కోట్ల విలువైన తీరం ఆక్రమించే పక్కా స్కెచ్
చీరాల అర్బన్: ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్ మాదిరిగా వేటపాలెం స్ట్రయిట్‌కట్ సీమౌత్ వద్ద మార్పునకు వ్యూహం పన్నారు. ఆ ప్రాంత మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రాకుండా స్ట్రయిట్‌కట్‌లో జెట్టీ నిర్మాణం జరుగుతుందని నమ్మబలుకుతున్నారు. ఆ ప్రాంత ప్రైవేటు వ్యక్తుల భూమి వెంట ప్రభుత్వ నిధులతో రోడ్డు ఏర్పాటుకు పథక రచన చేశారు. ఈ క్రమంలో పొట్టిసుబ్బయ్యపాలెం తీరం నుంచి స్ట్రయిట్‌కట్ కాలువ వరకు వారు అనుకున్నది జరిగితే సుమారు 50 ఎకరాల తీరప్రాంత భూమి అనధికారికంగా వారి ఆధీనంలోకి వెళుతుందని, దాని విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని చెప్పుకుంటున్నారు. అందుకు స్థానిక పచ్చనేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అభివృద్ధి పేరుతో...
అక్కడ జరిగే లోపాలను, ఆక్రమణల ఆలోచన బయట పడకుండా అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. ఆ క్రమంలో సదరు భూములు వెంట ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.2.50 కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతోందని.. కలెక్టర్ నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారని.. సీమౌత్ వద్ద వాలు మలుపు తిప్పుతామని చెబుతున్నారు. అందుకు డ్రైనేజీ శాఖ పరంగా నిధులు మంజూరు చేస్తారని.. లేదంటే తామే నిధులు సమకూర్చి అధికారుల పర్యవేక్షణలో వాలు మలుపు చర్యలు చేపట్టే విధంగా అడుగులు వేస్తున్నామంటున్నారు. కాలువ దగ్గర జెట్టీ నిర్మాణం జరుగుతోందని.. మత్స్యకారులకు ఇబ్బంది ఉండదని పేర్కొంటున్నారు. అప్పుడు తీరం నుంచి మా భూముల పక్కన వచ్చే రోడ్డు వరకు ఎత్తు, పల్లాలుగా ఉన్న ఇసుకను చదును చేస్తామని.. ఇలా ప్రస్తుతం ఆ ప్రాంతంలో జరుగుతున్న ప్రచారం.
సీఆర్‌జెడ్ పరిధి పట్టించుకోవాలి..
ఆ ప్రాంతంలో తీరం నుంచి సీఆర్‌జెడ్ పరిధి, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రచారంలో చేపట్టే పనులు తదితర విషయాలపై సంబంధిత అధికారులు సమగ్రంగా సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈపురుపాలెం స్ట్రయిట్ కట్ వివాదంలో అధికారులు మీనమేషాలు లెక్కించారు. తీరా సమస్య తీవ్ర రూపం దాల్చిన తరువాత పరిష్కార చర్యలు చేపట్టారు. చివరకు విషయం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తాజాగా వేటపాలెం స్ట్రయిట్‌కట్ వాలు మలుపుకు సంబంధించి ఆ ప్రాంతవాసుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముందస్తుగా అధికారులు స్పందించి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. తీరం పరాధీనం కాకుండా కాపాడాలి.
ప్లాట్లు విక్రయించేందుకు అడుగులు
వీరిలో వస్త్ర వ్యాపారి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాకుండానే ప్లాట్లు వేసి విక్రయించేందకు అడుగులు వేశారు. విషయం బహిర్గతం కావటంతో ఆయన తాత్కాలికంగా వెనకడుగు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కొత్త ఆలోచనతో ముందుకెళుతున్నారు. అందుకు పచ్చనేత చేసిన హితోపదేశమే కారణమని సమాచారం.
సునామీ సమయంలో...
గతంలో సునామీ వచ్చినప్పుడు పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో భయంకరమైన అలల తాకిడికి సుమారు 9 మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో ఆ ప్రాంతంలో భారీ ఇసుక తిన్నెలు ఉండేవి. దీంతో ప్రమాదస్థాయి ఒకింత తగ్గింది. తరువాత ఇసుక తిన్నెలు మానవ చర్యలతో కనుమరుగయ్యాయి. ఈ క్రమంలో సీ వ్యూ పేరుతో తాత్కాలిక లబ్ధి కోసం చేపట్టే చర్యలు భవిష్యత్‌లో ప్రమాద హేతువులు కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ గీతారాణిని వివరణ అడగ్గా ఆమె పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు.


