ముగిసిన అండర్‌–11 చెస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన అండర్‌–11 చెస్‌ పోటీలు

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

ముగిసిన అండర్‌–11 చెస్‌ పోటీలు రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ముగిసిన రంగనాథుని బ్రహ్మోత్సవాలు సాగర్‌ నీటిమట్టం

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): స్థానిక ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులోని విజేత ఐఐటీ స్కూలులో ఆదివారం నైట్‌ క్యాజిల్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యాన నిర్వహించిన అండర్‌–11 చిన్నారుల చెస్‌ పోటీలు ముగిశాయని టోర్నమెంట్‌ డైరెక్టర్‌ వైవీకే చక్రవర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50 మందికిపైగా చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. బాలికల విభాగంలో పి.లాలిత్య, పి.భవిష్య, బాలురలో ఎం.చేతన్‌, శౌర్యదీప్‌ సింగ్‌లు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించి విజేతలుగా నిలిచారన్నారు. నలుగురు చిన్నారులు ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌ రవీంద్రరాజు, విజేత స్కూల్‌ డైరెక్టర్‌ నిమ్మల సురేష్‌, ఇన్‌చార్జి సంధ్యలు విజేతలకు బహుమతులు అందించారని తెలిపారు.

రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌

నగరం: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి మీ భూమి–మీ హక్కు కార్యక్రమం దోహదపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. బాపట్ల జిల్లా నగరం మండలం పూడివాడ గ్రామంలో ఆదివారం జరిగిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రీ సర్వేతో రైతులకు స్పష్టమైన భూ హక్కులు లభిస్తున్నాయన్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత శాసీ్త్రయంగా రూపొందించిన భూ హక్కు పత్రాలు పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ బి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల హద్దులు, విస్తీర్ణం కచ్చితంగా నిర్ధారించడంతో భూ వివాదాలు తగ్గడమే కాకుండా రైతులకు బ్యాంక్‌ రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా పొందవచ్చన్నారు. భూహక్కు పత్రాలు, పాస్‌ పుస్తకాలను రైతులు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట, ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్‌ నాంచారయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.

యడ్లపాడు: మండల పరిధిలోని సొలస గ్రామంలో వెలసిన శ్రీ భూ సమేత రంగనాయక స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఆదివారం పవళింపు సేవతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యుల నేతృత్వంలో స్వామి వారికి పూలంగి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు చేశారు. ఆలయ ఈఓ నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్‌– నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి రంగనాథుని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. భక్తుల గోవింద నామస్మరణతో సొలస క్షేత్రం మార్మోగింది.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 525.40 అడుగులకు చేరింది. ఇది మొత్తం 159.3072 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement