తవ్వకాల్లో పాత్రధారులపై కేసు లేకుండా టీడీపీ నేతల పావులు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం
సాక్షి, టాస్క్ ఫోర్స్: రంగురాళ్ల కేసును నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండల పరిధిలోని శంకరాపురం అటవీ భూముల్లో టీడీపీ నాయకులు తవ్వితీసిన రంగురాళ్లను ఆ శాఖ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గత మూడు రోజుల క్రితం దాచేపల్లిలో ఓ గోడౌన్‌లో పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న రంగరాళ్లను వినుకొండకు తరలించి భద్రపరిచారు. అయితే స్వాధీన పరుచుకున్న రంగురాళ్ల వివరాలను నేటికీ పూర్తిస్థాయిలో అధికారులు వెల్లడించకపోగా... ఈ కేసుపై నీలినీడలు కమ్ముకునేలా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాచేపల్లిలో దొరికిన రంగరాళ్లను టీడీపీకి చెందిన కీలక నేతల పాత్ర ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీలో కీలకంగా ఉన్న సదరు నాయకులపై కేసులు పెట్టకుండా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. రాష్ట్రస్థాయిలో ఓ ముఖ్య నేత ద్వారా ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి చేస్తూ టీడీపీ నాయకులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తవ్వకాలు చేసే కూలీలపైనే కేసులు పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. సూత్రధారులను విడిచిపెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి.
అధికారుల పాత్రే కీలకం
దాచేపల్లిలో పట్టుబడిన రంగురాళ్లు సుమారుగా రూ.కోటి పైనే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంత భారీ స్థాయిలో రంగురాళ్లు పట్టుబడటం ఇదే మొదటిసారి. అటవీ భూముల్లో యథేచ్ఛగా రంగురాళ్ల కోసం తవ్వకాలు నిర్విరామంగా జరుగుతుంటే అధికారులు చూడకపోగా.. కేసులు కూడా నీరుగార్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ శాఖ అధికారులు కూడా తాయిలాలు అందినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ కారులో లభించిన రంగురాళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు కారును వదిలి పెట్టేందుకు భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. శాఖాపరమైన విచారణ జరిగినట్లు కూడా సమాచారం. రంగు రాళ్లు తవ్వించే అక్రమార్కులకు పూర్తిస్థాయిలో అటవీశాఖ అధికారుల సహకారం ఉండటం వల్లనే కొండకు సొరంగాలు వేస్తున్నారు. సహజసిద్ధమైన సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపారు. శంకరాపురం కొండలలో రంగురాళ్ల తవ్వకాల వ్యవహారం పైస్థాయి అధికారులకూ తెలుసని సమాచారం. ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


