566.60 గ్రాముల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ బి.కృష్ణారావు
గురజాల: వ్యాపారిపై దాడి చేసి బంగారం దొంగిలించి పరారైన నిందితులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వినుకొండకు చెందిన బంగారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావు రెడీమెడ్ బంగారం వస్తువులు అమ్మడం కోసం ప్రతి సోమవారం కారంపూడి వస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27వ తేదీన కారంపూడికి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో అంకాళమ్మ దేవాలయం వద్ద యూనియన్ బ్యాంకు సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా పథకం ప్రకారం అతనిపై దాడి చేసి అతని వద్ద ఉన్న బంగారం వస్తువులను తీసుకుని పరారయ్యారు. కారంపూడిలోని శివరామకృష్ణ జ్యూయలర్స్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న గోసుల సాంబయ్య పన్నిన పథకం ప్రకారం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం బండారు అజిత్, గుంటూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన కాండ్రగుంట శశికుమార్, కాండ్రకుంట సాయికిరణ్, అన్నం నిఖిల్, గుంటూరులోని గుజ్జనగుండ్లకు చెందిన గోగుల పవన్, పమిడిపాడు గ్రామానికి చెందిన గోసుల సాంబయ్యలు ఒక ప్లాను ప్రకారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావుపై దాడి చేసి బంగారం వస్తువులను దొంగిలించి పరారయ్యారు. ఆ ప్రాంతంలోని సీసీ పుటేజీలు ద్వారా నిందితులను పోలీసులు గుర్తించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను కారంపూడిలోని పేటసన్నెగండ్ల కాలువ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువ కలిగిన 566.60 గ్రాముల బంగారం, యమహా–ఎంటీ 15, హీరో గ్లామర్ ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను చాకచాక్యంగా పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులను ఎస్పీ అభినందంచారు. సమావేశంలో డీఎస్పీ ఎంఎ మహేశ్వరరావు, సీఐ పి శరత్‌బాబు, ఎస్‌ఐ ఎం వాసులు పాల్గొన్నారు.


