మొక్కజొన్న రైతులకు అన్యాయం
వినుకొండ: చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణంతోపాటు పరిపాలన అంతా కూడా గ్రాఫిక్సే అని వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొల్లా మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు నేటికీ న్యాయం జరగలేదని, రాజధాని నిర్మాణం జరిగినట్టు ఔటర్ రింగ్ రోడ్డు కోసం మరో 20,000 ఎకరాలు కావాలని రైతులను వేధిస్తున్నారన్నారు. ఎక్కడైనా నగరం నిర్మాణం జరిగిన తర్వాత ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తారని, అమరావతిలో అసలు ఏమీ లేకుండానే గ్రాఫిక్స్ రూపంలో చూపించి రైతుల వద్ద పొలాలను తీసుకోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నానా అవస్థలు ఎదుర్కొంటుంటే పట్టించుకోకుండా రాజధాని అభివృద్ధి పేరుతో ఐదు గంటలపాటు నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కేవలం ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించేందుకే సరిపోయిందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఈరెండేళ్ల సమయంలోనే రాష్ట్రంలో విధ్వంస పాలన జరిగిందన్నారు.
మొక్కజొన్న రైతులకు కూడా న్యాయం చేయలేకపోయారని అన్నారు. ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు, రైతులకు సేవలు చేసే ప్రతి ఒక్క వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. నేరాలు అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను బెదిరించడంలో కొత్త ట్రెండ్ తీసుకొచ్చారని, చదువుకునే విద్యార్థులపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. తిరునాళ్లలో కనీసం విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా వైఎస్సార్ సీపీ వారికి అనుమతులు ఇవ్వడం లేదని, సుపరిపాలన అంటే ఇదేనా అని దుయ్యబట్టారు. ఇప్పటికై నా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పంచాయతీ రాష్ట్ర విభాగం కార్యదర్శి వెంకటరామిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గంధం బాలిరెడ్డి, మండల కన్వీనర్లు దండు చెన్నయ్య నారాయణరెడ్డి, బోడేపూడి కొండలు, రెడ్డి బోయిన ప్రవీణ్ కుమార్, గుంజి వాసు తుమ్మ వెంకటరెడ్డి కొత్త కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వినుకొండ మాజీ ఎమ్మెల్యే
బొల్లా బ్రహ్మనాయుడు


