యడ్లపాడు: మండలంలోని మైదవోలు గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు, కోచ్ నక్కా శ్రీనివాసరావు చైనాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐవీబి లెవల్–3 అంతర్జాతీయ కోచింగ్ కోర్సుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తనపేరును అధికారికంగా సిఫార్సు చేసినట్లు ఆదివారం తెలిపారు. చైనా వేదికగా ఈ ఏడాది జూలై 17 నుండి 25 వరకు ఈ అత్యున్నత స్థాయి శిక్షణ తరగతులు జరగనున్నాయి. వాలీబాల్ కోచింగ్‌లో అత్యున్నత ప్రమాణంగా భావించే లెవల్–3 కోర్సుకు ఇంత చిన్న వయసులోనే ఎంపిక కావడం విశేషం. శ్రీనివాసరావు ఎంపిక పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు వయోపరిమితి పెంపు వర్తింపజేయాలి
కారెంపూడి: ఏపీ మోడల్ స్కూల్స్‌లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ అమరావతి జేఏసీ అధ్యక్షుడు వినుకొండ పేరయ్య తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని రంగాల ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న వారి వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందని, అయితే ఏపీ మోడల్ స్కూల్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులను మాత్రం మరచిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ మోడల్ స్కూల్స్‌లో పని చేస్తున్న వారికి కూడా వయోపరిమితి పెంపు వర్తింపచేయాలని కోరారు.
నేడు సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ డే
తాడికొండ: రాజధాని అమరావతి రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘గ్రీవెన్‌న్స్ డే‘ నిర్వహించనున్నట్లు సీఆర్డీయే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో వివిధ విభాగాల అధికారులు అర్జీలు స్వీకరిస్తారు కావున రాజధాని ప్రాంతవాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
మిర్చి కమీషన్ దుకాణంలో నగదు చోరీ
నగరంపాలెం: మిర్చి కమీషన్ దుకాణంలో నగదు చోరీపై బాధితుడు లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్గా రోడ్డులో శివరామచౌదరి మిర్చి కమీషన్ దుకాణం నిర్వహించేవారు. శుక్రవారం రాత్రి దుకాణం షట్టర్‌కి తాళం వేసి వెళ్లాడు. శనివారం ఉదయం దుకాణం వద్దకు వచ్చేసరికి షట్టర్ తాళాలు పగిలిపోయి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే లోనికెళ్లి బీరువా చూడగా, అందులో భద్రపరిచిన రూ.6 లక్షలు కనిపించలేదు. ఎవరైనా గుర్తుతెలియని అగంతకులు నగదు తస్కరించినట్లు గుర్తించి లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దుకాణం, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అలాగే సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల పుటేజీ సేకరించారు.
నేడు నాగార్జున యూనివర్సిటీ పాలకమండలి సమావేశం
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో పాలకమండలి సమావేశం సోమవారం జరగనుంది. ఈ సమావేశం ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదింప చేయనున్నారు. ఈ వార్షిక బడ్జెట్‌లో యూనివర్సిటీకి వచ్చే ఆదాయం, ఖర్చులు ప్రభుత్వం విడుదల చేసే బ్లాక్ గ్రాండ్ నిధులు, ఉద్యోగుల వేతనాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు వంటి ప్రధాన అంశాలకు బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి. సమావేశానికి ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు అధ్యక్షత వహించనున్నారు.
పార్టీ బలోపేతానికి
కృషి చేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
మంగళగిరి టౌన్: పార్టీలోనే ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ పిలుపునిచ్చారు. మంగళగిరి పట్టణ పరిధిలోని గౌతమ బుద్ధా రోడ్‌లో ఉన్న బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభయాన్ 2026 శిక్షణా తరగతులు నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన శిక్షణ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. చివరిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా కృషి చేయాలన్నారు. అంతోద్యయ ద్వారా సమాజంలోని చివరి వ్యక్తికి సేవలు చేరేలా సర్వ వ్యాప్తి, సర్వస్పర్శి లక్ష్యంతో పార్టీ విస్తరణ జరగాలని సూచించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ సిద్ధాంతాలపై విశ్లేషాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివన్నారాయణ, జిల్లా కార్యదర్శి పంచుమర్తి ప్రసాద్, మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


