ఏప్రిల్ 3 నుంచి
యడ్లపాడు: నిస్తేజమవుతున్న నాటక రంగానికి ఊపిరి పోస్తూ..భావితరాలకు సంస్కృతిని వారసత్వంగా అందించే వేదికలే నాటక పరిషత్‌లు అని డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు చెప్పారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్యర్యాన జరిగే 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీల పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. పరిషత్ అధ్యక్షులు సురేష్‌బాబు, కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన వేడుకల వివరాలను తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిషత్తుల్లో ఉత్తమ రచనలు, బహుమతులు సాధించిన పది మేటి నాటికలు తమ వేదికపై ప్రేక్షకులను అలరించనున్నాయని తెలిపారు. ఈ ఏడాది వేడుకల్లో భాగంగా సినీ, టీవీ నటులు, దర్శకులు ఉప్పులూరి సుబ్బరాయశర్మకు ప్రతిష్టాత్మక పుచ్చలపల్లి పురస్కారం అందజేయనుండగా, తెలుగు అకాడమీ చైర్మన్, పౌరాణిక నాటక రంగంలో విశేష గుర్తింపు పొందిన కళారత్న గుమ్మడి గోపాలకృష్ణను పుచ్చలపల్లి సుందరయ్య ● వేదిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సన్మానం ఉంటుందన్నారు. ప్రదర్శనల్లో పాల్గొనే ప్రతి మహిళా కళాకారిణిని ఆడపడుచుగా గౌరవిస్తూ సత్కరించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. పోటీల్లో తీర్పు విషయంలో పూర్తి పారదర్శకత కోసం ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు వంటి విభిన్న రంగాలకు చెందిన 18 మందిని న్యాయనిర్ణేతలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. మూడు రోజుల పాటు ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ప్రేక్షకులకు అల్పాహారం, వారికి కూపన్లు ఇచ్చి రోజుకు 40 మంది చొప్పున మూడు రోజులు 120 మందికి లక్కీడ్రా ద్వారా విలువైన బహుమతులు అందజేస్తామన్నారు. కళాకారులకు పారితోషికం, జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు వివరించారు. తెలుగు నాటక వైభవాన్ని చాటిచెప్పే ఈ మహా ప్రదర్శనలకు కళాభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ముత్తవరపు రామారావు, ఉపాధ్యక్షులు జరుగుల శంకరావు, వేదిక సంయుక్త కార్యదర్శి పోపూరి నాగేశ్వరరావు, ముత్తవరపు పద్మారావు, బొప్పన్న నరసింహరావు(బుజ్జి), షేక్ బాజి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించిన
డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు


