బాభౌయ్‌ | - | Sakshi
Sakshi News home page

బాభౌయ్‌

Mar 25 2026 7:09 AM | Updated on Mar 25 2026 7:09 AM

మార్కెట్లలో భయం భయం..

పిక్కలు పీకేస్తున్న వీధి కుక్కలు

మున్సిపాలిటీ పరిధిలో ప్రజల బెంబేలు

నామమాత్రపు చర్యలకే

అధికారులు పరిమితం

చిలకలూరిపేట టౌన్‌: మున్సిపాలిటీల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది. గుంపులు గుంపులుగా చేరి, రోడ్లపై స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పట్టణంలో ఏ వార్డులో చూసినా గ్రామ సింహాల గుంపులే దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటకు రావాలంటేనే వణుకుతున్నారు. బైక్‌లపై వెళ్లే వారి వెంటపడుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. కుక్కకాటు బారిన పడుతున్న బాధితుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. తాజాగా మంగళవారం సుగాలి కాలనీకి చెందిన ప్రవీణ్‌ ముఖంపై దాడి చేయగా, తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 138 మంది, మార్చిలో ఇప్పటి వరకు 95 మంది ఈ శునకాల బారిన పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సమావేశాల్లో ఏకరువు పెట్టినా...

ఈ సమస్యపై వార్డు కౌన్సిలర్లు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో పలుమార్లు ఏకరువు పెట్టారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో అధికారులు కుక్కలను పట్టించి, జంతు జనన నియంత్రణ శస్త్రచికిత్సలు, రేబీస్‌ వ్యాక్సిన్‌లు వేయించి, మళ్లీ అదే ప్రాంతాల్లో వదిలిపెట్టారు. ఇందుకోసం ఒక్కొక్క కుక్కకు రూ.1,500 వరకు ఖర్చు చేశారు. ఫలితం మాత్రం శూన్యంగా మారింది.

సుప్రీంకోర్టు ఆగ్రహించినా...

వీధి కుక్కల బెడద విషయంలో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పాలకులు మాత్రం ఈ సమస్యను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారు. సమస్యను తాత్కాలికంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల కుక్కల దాడిలో గాయపడిన ఓ మహిళ (ఫైల్‌), మంగళవారం గాయపడిన ప్రవీణ్‌

ప్రధానంగా కూరగాయల మార్కెట్‌, మటన్‌, చికెన్‌ మార్కెట్ల సమీపంలోనే కుక్కల బెడద మరింత ఎక్కువగా ఉంది. కవర్లలో ఆహార పదార్థాలు తీసుకువెళ్లే వారిపై కుక్కలు దాడి చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. ఇప్పటికై నా మున్సిపల్‌ అధికారులు స్పందించి ప్రజలను కాపాడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement