పంట పండిస్తున్న ప్రత్యామ్నాయం
చంద్రబాబు సర్కారు తీరుతో రైతులకు తీవ్ర నష్టం ఇప్పటివరకు సాగు చేస్తున్న పంటలకు దక్కని గిట్టుబాటు ధర ఏటా తప్పని కష్టాలతో మనసు మార్చుకున్న అన్నదాతలు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగుకు చర్యలు
సాధారణంగా పండించే వరి, పత్తి, పొగాకు, మిర్చి వంటి పంటలకు చంద్రబాబు సర్కారు వచ్చాక గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల పాలవుతున్నారు. రెండేళ్లుగా ఏటా పెట్టుబడులు కూడా రాకపోవడంతో కన్నీళ్లే మిగిలాయి. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబు పాలనలో విత్తనాలు, ఎరువుల ధరలు భారీగా పెరగడమే కాకుండా లభ్యత కూడా అంతంతమాత్రంగానే మారింది. అష్టకష్టాలు పడి పంట పండించినా ధరల్లేక రైతులు విలవిల్లాడుతున్నారు.
అమరావతి: ఖరీఫ్ సీజన్‌లో పత్తి, మిరప పంటలు సాగు చేసిన రైతులు వాతావరణం అనుకూలించక పలు రకాల తెగుళ్లతో నష్టపోయారు. దీంతో మండలంలోని రైతులు రబీ సీజన్‌లో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు, వైరస్, మిర్చి పంటలో తామర పురుగు తాకిడితో తీవ్రంగా నష్టపోయారు. ప్రత్యామ్నాయంగా శనగ, టమాటా, బంతి, ఆకుకూరలు, కూరగాయ పంటలైన మునగ, వంగ, బొప్పాయి వంటి వాటిపై దృష్టి సారించారు. కొద్దోగొప్పో నీటి వసతి ఉన్న చోట్ల అధికంగా, బోర్‌లపై ఆధారపడిన గ్రామాలలో కొద్ది విస్తీర్ణంలో ఈ పంటలను సాగు చేస్తున్నారు.
సర్కారు తీరే పెద్ద శాపం
పత్తి పైరుకు ఎకరాకు రూ.30 వేలు, మిర్చి పైరుకు ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టినా వాతావరణం అనుకూలించక, చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా గత సంవత్సరం బొప్పాయి, శనగ పైర్లు వేసిన రైతులు నష్టాలు లేకుండా ఆదుకోవటంతో ఈ సంవత్సరం ఎక్కువ మంది ఈ పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మునగ, టమాటా, బొప్పాయి, బంతిపూలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో రైతులు ఉత్సాహంగా ఈ పంటలను సాగు చేస్తున్నారు. అలాగే వాణిజ్య పంటల తరహాలో ఈ పంటలకు ప్రభుత్వం ధర నిర్ణయించే వీలు లేనందున ఏ రోజుకారోజు మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రేటు ఉంటోంది. రైతులు లాభం పొందే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో మునగ కాయలు కేజీ రూ.70 వరకు ధర పలుకుతుండటంతో రైతులు లాభపడే పరిస్థితి ఉంది. అలాగే గత సంవత్సరం మండలంలో బొప్పాయి సాగు చేసిన రైతులకు సగటున ఎకరాకు 50 నుంచి 60 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. రూ.లక్షల్లో లాభాలు రావటంతో ఈ ఏడాది బొప్పాయి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండే బంతి, టమాటా, ఆకుకూరలను కూడా రైతులు సాగు చేయటానికి ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతినటంతో రైతులు ప్రత్యామ్నాయంగా శనగ పైరును కూడా సుమారు వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారు.
కూరగాయల సాగుకు మొగ్గు
శనగ పైరును కూడా సుమారు 500 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మల్లాది, దిడుగు, పెదమద్దూరు రైతులు బంతి పూల సాగును సుమారు 30 ఎకరాలలో చేపట్టి లాభాలు గడిస్తున్నారు. బెండ, కాకర, టమాట, పొట్ల, దోస వంటి కూరగాయలను లేమల్లె, నరుకుళ్లపాడు, ఎండ్రాయి తదితర గ్రామాలలో పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో కూరగాయలు, బంతిపూలు, ఆకుకూరలు పండించటంపై అవగాహన కల్పిస్తే మరింత విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉంది. వాణిజ్య పంటల సాగుతో విసిగి వేసారిన రైతులకు వీటి సాగుపై ఉద్యాన శాఖ శిక్షణ ఇచ్చి, తగిన ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంది.
పంట పండిస్తున్న ప్రత్యామ్నాయం


