ఫ్లై ఓవర్ భద్రతకు ముప్పు
కింది భాగంలో కార్ఖానా మంటలు నల్లగా మసిబారిన పిల్లర్, శ్లాబ్ నిర్మాణం బలహీన బడుతుందని నిపుణుల హెచ్చరిక ఆందోళన చెందుతున్న ప్రజానీకం పట్టించుకోని మునిసిపల్ అధికారులు
నరసరావుపేట టౌన్: ఓవర్ బ్రిడ్జి భద్రతకు ముప్పు ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల ఇష్టారాజ్యం అందుకు కారణం. ఓవర్ బ్రిడ్జి కింద భాగంలో మిఠాయి దుకాణ నిర్వాహకుడు పిల్లర్‌కు ఆనుకొని కార్ఖానా ఏర్పాటు చేయటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజూ అక్కడ పొయ్యి వెలిగించి ఆ మంటతో వంటకాలు చేస్తున్నారు. నిరంతరం వెలుగుతున్న వేడి ధాటికి పిల్లర్ ఉపరితల భాగం దెబ్బతినటంతోపాటు పై శ్లాబ్ పెచ్చులూడిపోవటం భయాందోళన కలిగిస్తోంది. చిత్రాలయ టాకీస్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి క్రింది భాగంలో కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతోంది. కళ్ల్లెదుట బ్రిడ్జి రోజురోజుకు దెబ్బతింటున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇలానే కొనసాగితే భవిషత్తులో ఓవర్ బ్రిడ్జికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
పెద్ద ప్రమాదానికి సంకేతం
ఇలానే కొనసాగితే పిల్లర్లు బలహీనపడి భవిష్యత్తులో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఇంజినీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిడ్జి కింద మంటలు, వేడి వంటకాల వల్ల కాంక్రీట్ నిర్మాణాలు బలహీన పడి వంతెన మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. బ్రిడ్జ్జి కింద ఏర్పాటు చేసిన అనధికార ఖార్ఖానాను తొలగించి శాశ్వత పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కొరవడిన సమన్వయం
రోడ్డు భవనాల శాఖ, పురపాలక శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఓవర్ బ్రిడ్జి కింద భాగంలో వదిలిపెట్టిన కానాలు ఆక్రమించారు. అక్కడ శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేసి కొందరు వ్యాపారాలు నిర్వహిస్తుండగా, మరి కొందరు రోజు వారి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్ సెంటర్‌లో ఓవర్ బ్రిడ్జి కానాల ఆక్రమణల వల్ల నిత్యం అక్కడ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా అధికారులు ఓవర్ బ్రిడ్జి పర్యవేక్షణ తమ పరిధి కాదంటూ ఒకరిపై ఒకరు చెప్పుకొంటూ దాటవేస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పెద ముప్పు వాటిల్లక ముందే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఫ్లై ఓవర్ భద్రతకు ముప్పు


