రూ.12 వేల కోట్ల విద్యుత్ భారం మోపేందుకు యత్నాలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు
నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం లేదంటూనే సర్దుబాటు చార్జీల పేరుతో నెలనెలా వసూలు చేస్తూనే తాజాగా రూ.12,617 కోట్ల భారాన్ని వేసేందుకు రంగం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు చెప్పారు. ఈ ప్రతిపాదన తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో 2019–20, 2023–24 ఏడాదికి సంబంధించి సర్దుబాటు చార్జీల కింద ప్రజలపై భారాలు వేయడం తగదన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నియంత్రణ మండలికి పంపిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చార్జీల పెంపుదల వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వ పాలనలో రూ.32 వేల కోట్ల భారాలు వేశారని, కూటమి అధికారంలోకి వస్తే ఎటువంటి భారాలు వేయబోమని హామీ ఇచ్చి ఉమ్మడి బాదుడు మొదలు పెట్టారన్నారు. తాజాగా 2026–27 ఆర్థిక ఏడాదికి విద్యుత్ చార్జీల నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేసిందని, దీని ప్రకారం 2026–27ఏడాదికి సంబంధించి రూ.15,651 కోట్ల భారం ప్రజలపై పడనుందన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతోపాటు తేమ సాకుతో పంటను మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. ధాన్యం బస్తాకు రూ.500, క్వింటా పత్తి రూ.3వేలు నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి తేమ శాతం నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.ఆంజనేయులున ాయక్, వై.రాధాకృష్ణ, ఏపూరి గోపాలరావు, జి.రవిబాబు, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి పాల్గొన్నారు.


