పిన్నెల్లి సోదరుల అరెస్టుపై నిరసన
కూకట్‌పల్లి: మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కుట్రపూరిత కేసులు పెడుతున్నారని కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్‌లో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆదివారం నిరసన వ్యక్తం చేశాయి. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని, పిన్నెల్లి సోదరులపై పెట్టిన అక్రమ కేసులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్ల కార్డులతో నల్ల కండువాలు వేసుకుని కేపీహెచ్‌బీ బస్‌స్టాప్ సెంటర్‌లో బైఠాయించారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి, శ్యామల, వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి మల్లు సురేంద్రరెడ్డి, స్పోక్స్ పర్సన్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 18 నెలల కాలంలో 16 అక్రమ కేసులు పెట్టారని, నాలుగుసార్లు వరుసగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కావాలని అక్రమంగా కేసులు పెట్టడం సిగ్గు చేటన్నారు. టీడీపీకి చెందిన రెండు వర్గాల వాళ్లు పాత గొడవల నేపథ్యంలో చంపుకుంటే దాన్ని స్వయానా జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా చెప్పినా కూడా ఆ కేసుని కూడా పిన్నెల్లిపై మోపి జైలుకి పంపడం చూస్తుంటే ఒక చెడు సంప్రదాయం అనే విత్తుని నాటారని దానికి ముగింపు ఎలా ఉంటుందో రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ చూపిస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు వుయ్ స్టాండ్ విత్ పిన్నెల్లి బ్రదర్స్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో శివారెడ్డి, మధుసూదనరెడ్డి, కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పిన్నెల్లి సోదరుల అరెస్టుపై నిరసన


