కుటుంబ కలహాలతో వివాహిత హత్య
కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటున్న భార్య స్వెట్టర్ లేసు గొంతుకు బిగించి భార్యను హత్య చేసిన భర్త మృతదేహంతో బైక్‌పై అద్దంకి వెళ్లి లొంగిపోయిన భర్త
రొంపిచర్ల/అద్దంకి రూరల్: కుటుంబ కలహాలతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన అల్లరి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్‌కు మండలంలో మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి(24) తో తొమ్మిది సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటేష్ బేకరీ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాఫీగా సాగుతున్న వారి సంసారంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి కొంత కాలంగా తన భర్త, పిల్లలను వదిలి మాచవరం గ్రామంలో తన పుట్టింటి దగ్గర ఉంటోంది. నెలలు గడుస్తున్నా భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో వెంకటేష్ మాచవరం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. తన భర్త వద్దకు వెళ్లేందుకు భార్య నిరాకరించింది. దీంతో వెంకటేష్ తన సోదరి సాయంతో ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ పనికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మాచవరానికి వచ్చిన వెంకటేష్ తన భార్యకు వద్దకు వెళ్లాడు. పాపకు బంగారం తెచ్చాను, మన ఇంటికి వెళ్దామని చెప్పి నమ్మించి బండిపై తీసుకెళ్లాడు. ఊరి వెలుపలకు వెళ్లిన తర్వాత భార్యతో మాటా మాటా పెరిగి గొడవ పడ్డారు. ఆమె ధరించిన చలికోటు నుంచి లేస్ తీసి మెడకు వేసి బిగించి లాగి దాడికి పాల్పడ్డాడు. అనంతరం మోటారు బైక్‌పై ఆమెను తీసుకొని బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. జరిగిన విషయం పోలీసులకు తెలియజేయగా ప్రాణం ఉందేమోనని భావించి ఆమెను సంతమాగులూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ మహిళ చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. నరసరావుపేట రూరల్ సీఐ ఎం.వి.సుబ్బారావు మాచవరంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. చిన్న పిల్లలు అనాథలయ్యారు. ఈ విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్‌ను రొంపిచర్ల పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకుని స్టేషన్‌కు చేరుకున్న నిందితుడు
కుటుంబ కలహాల నేపథ్యంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరం గ్రామంలో భార్యను చంపిన నిందితుడు ఆదివారం సంతమాగులూరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
మహాలక్ష్మి మృతదేహం
కుటుంబ కలహాలతో వివాహిత హత్య


