ప్రైవేటుపరంపై నిరసన గళం
తుది దశకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం నేడు జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పత్రాల తరలింపు నరసరావుపేటలోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా 4.30 లక్షల సంతకాలు పత్రాల తరలింపు కార్యక్రమానికి భారీగా హాజరుకావాలని పిలుపునిచ్చిన జిల్లా నేతలు
నియోజకవర్గాల వారీగా వివరాలు..
పేదల జీవితాలను నాశనం చేసేలా చంద్రబాబు సర్కారు చేస్తున్న కుట్రలపై ప్రజా ‘సంతకమే’ సమర శంఖం మోగించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉన్న వ్యతిరేకత ప్రజాగళమై గర్జించింది. పేదల సొమ్మును పెత్తందారుల చేతిలో పెట్టనున్న చంద్రబాబు ప్రభుత్వంపై పోరుకు నాంది పలికింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల నుంచి లభించిన అనూహ్య మద్దతుతో కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల పత్రాలను భారీ ర్యాలీల నడుమ తరలించనున్నారు.
సాక్షి, నరసరావుపేట : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైద్య కళాశాలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం తుది దశకు చేరింది. ఇప్పటికే జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో సేకరించిన కోటి సంతకాల పత్రాలను జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి తరలించారు. నేడు ఆ పత్రాలను భారీ ర్యాలీగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్నారు. దీన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్తలు పిలుపునిచ్చారు.
అనూహ్య మద్దతు
జిల్లాలోని వినుకొండ, మాచర్ల, గురజాల, చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలో ఇప్పటికే 4.30 లక్షలకుపైగా సంతకాలు పూర్తి అయ్యాయి. ఆయా నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో నేడు నరసరావుపేటలో జరిగే ర్యాలీకు హాజరుకానున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు వైద్యవిద్య కలను నిజం చేయాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గతంలో ఎన్నడూ లేనివిధంగా 17 మెడికల్ కళాశాలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రారంభిస్తే అక్కడి వైద్యశాలల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చేది. అయితే వారి పేద, మధ్య తరగతి ప్రజల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం సమాధి చేస్తోంది. తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డాక్టర్ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది.
నియోజకవర్గం సంతకాల సంఖ్య
మాచర్ల 72,452
గురజాల 51,326
సత్తెనపల్లి 66,507
పెదకూరపాడు 50,500
నరసరావుపేట 62,500
చిలకలూరిపేట 63,511
వినుకొండ 63,500
మొత్తం 4,30,296


