అడ్డు తొలగింపునకే హత్యలు
శ్రీకాంత్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం కాలువలోకి నెట్టి భార్య, ఏడు నెలల కుమారుడిని హత్య చేసిన ఘటనలో భర్త అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ హనుమంతరావు
నరసరావుపేట రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలోనే భార్య, ఏడు నెలల బాలుడిని ఎన్‌ఎస్‌పీ కాలువలోకి నెట్టి భర్త హత్య చేసాడని డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను శనివారం నరసరావుపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మీడియా సమావేశంలో వివరించారు. రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన కందారపు శ్రీకాంత్‌కు నాదెండ్ల మండల కేంద్రానికి చెందిన త్రివేణి(25)కి రెండు సంవత్సరాల వివాహమయింది. వీరికి ఏడు నెలల వయసున్న శరత్ ఉన్నాడు. శ్రీకాంత్ నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషీయన్ పనిచేస్తున్నాడు. రెండు, మూడు రోజులకు ఒకసారి ఇంటికి వస్తుండటంతో భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 5వ తేదీ రాత్రి 11గంటల సమయంలో రావిపాడు సమీపంలోని చిలకలూరిపేట మేజర్ కాలువలోకి త్రివేణిని, శరత్‌ను నెట్టి హత్య చేశాడు. త్రివేణి మృతదేహం అదే రోజు రాత్రి గుర్తించగా, శరత్ మృతదేహం ఇప్పటి వరకు లభించలేదు.
అడ్డుగా ఉన్నారనే..
శ్రీకాంత్‌కు మరో మహిళతో తన వివాహానికి ముందునుంచే సంబంధం ఉందని డీఎస్పీ తెలిపారు. ఈ విషయం త్రివేణికి తెలిసి నిలదీయడంతో పలు మార్లు ఆమైపె దాడి చేశాడు. భార్య, కుమారుడిని అడ్డు తొలగించుకుని ఆ మహిళను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 5వ తేదీ రాత్రి నరసరావుపేట నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో రావిపాడు సమీపంలోని కెనాల్ వద్ద త్రివేణితో గొడవపడ్డాడు. అటువైపుగా వచ్చిన వాహనదారులు దీనిని గమనించి ప్రశ్నించడంతో దంపతుల మధ్య గొడవ అని శ్రీకాంత్ తెలిపాడు. అనంతరం భార్యను, కుమారుడిని కాలువలోకి నెట్టి హత్య చేశాడు. రోడ్డు ప్రమాదంలో వారు కాలువలో పడినట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
మహిళ పాత్రపై దర్యాప్తు
ఈ హత్యల వెనుక శ్రీకాంత్‌తో వివాహేతర సంబంధం ఉన్న మహిళ పాత్రపై విచారణ చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ విషయాలపై శ్రీకాంత్‌ను కస్టడీకి తీసుకుని విచారణ జరపాల్సి ఉందని పేర్కొన్నారు. నిందితుడు శనివారం ఉదయం కొత్తపల్లి వీఆర్‌ఓ తలారి కిరణ్‌బాబు వద్ద నేరాన్ని అంగీకరించాడని, వీఆర్‌ఓ నిందితుడి వద్ద స్టేట్‌మెంట్ తీసుకుని పోలీసులకు అప్పగించినట్టు వివరించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన నరసరావుపేట రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు, ఎస్‌ఐలు సీహెచ్ కిషోర్, ఎస్‌కే ఫాతిమాలను ఆయన అభినందించారు. మీడియా సమావేశంలో సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ కిషోర్‌లు పాల్గొన్నారు.


