మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కిల్కారి సేవలు
నరసరావుపేట రూరల్: మాతా శిశు మరణాలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కిల్కారి సేవలు ప్రవేశపెట్టినట్టు జిల్లా ఆశ అధికారి సురేష్ తెలిపారు. నరసరావుపేటలోని బాబాపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కిల్కారి సేవలపై ఆశ, ఏఎన్‌ఎమ్‌లకు గురువారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గర్భిణీ నుంచి పుట్టిన బిడ్డ సంవత్సరం వరకు నెలకు ఒక సారి వాయిస్ కాల్స్ ద్వారా సమాచారం ఇస్తుందని తెలిపారు. కిల్కారి కాల్ వచ్చే నెంబరును 911600403660 గర్భిణులు, బాలింతలు సేవ్ చేసుకోవాలని సూచించారు. అప్పుడే కాల్ వినగల్గుతారని, మళ్లీ వినాలంటే 14423, 18005321255 టోల్‌ఫ్రీ నెంబర్‌కి చేసి వినవచ్చని సూచించారు. ఈ కిల్కారి కాల్‌లో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైరిస్క్, టీకాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, తల్లి బిడ్డలకు సలహాలు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ రాజు పాల్గొన్నారు.


