ప్రకృతి వ్యవసాయం ద్వారా వరిలో అధిక దిగుబడులు
●స్టేట్ రిసోర్స్ పర్సన్ రామచంద్రన్
●నర్సింగపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తున్న రైతు సాధికార సంస్థ ప్రతినిధులు, రైతులు
నకరికల్లు: ప్రకృతి వ్యవసాయ విధానంలో తక్కువ ఖర్చులో అధిక దిగుబడులు సాధించవచ్చని స్టేట రిసోర్స్‌పర్సన్ రామచంద్రన్ అన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఐసీఆర్‌పీలకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సింగపాడు గ్రామంలో రైతు గ్రామ సుబ్బారెడ్డికి చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ అన్ నేచురల్ ఫార్మింగ్ పథకంలో భాగంగా ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్‌కు, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్‌కు డిస్టిక్ మోడల్ మేకింగ్ ట్రైనర్ బృందాలకు ఐదు రోజులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రకృతి వ్యవవసాయ కార్యాలయం ద్వారా క్షేత్ర సందర్శన నిర్వహించామన్నారు. పిడుగురాళ్ల, క్రోసూరు, సత్తెనపల్లి డివిజన్‌ల నుంచి సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందనున్నారు. రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి పంట సాగు చేస్తే దిగుబడి అధికంగా ఉంటుందని, పంట పొలంలో గట్లపై పలు మొక్కలను వేయడం వలన అధిక ఆదాయం వస్తుందన్నారు, పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సిబ్బంది కృషి చేయాలన్నారు. పల్నాడు జిల్లాలో వరి, ప్రత్తి, మిరప పంట పొలాలను సాగు చేస్తున్న రైతులందరు భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రసాయనిక ఎరువులను వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలను సాగుచేస్తే భూమి ఆరోగ్యం కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు మేనేజర్ ప్రేమ్‌రాజు, ఎన్‌ఎఫ్‌ఏలు అప్పలరాజు, సైదయ్య, మాస్టర్స్, ట్రైనర్స్, ప్రకృతి వ్యవసాయ రైతులు, తదితరులు పాల్గొన్నారు.


