మాతృ మరణాలను నిరోధించాలి
నరసరావుపేట రూరల్: మాతృ మరణాలను నిరోధించే విధంగా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి మాతృ మరణాల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ హై రిస్క్ ప్రెగ్నెన్సీలపై క్షేత్ర స్థాయి సిబ్బంది ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రక్తంలో హీమో గ్లోబిన్ స్థాయి, గర్భిణులు, ఆరోగ్య, ఆదాయ స్థితిగతులను బట్టి హైరిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించాలని తెలిపారు. జిల్లాలో చోటుచేసుకున్న ఐదు మాతృ మరణాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరారు. బాధితుల కుటుంబీకుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రవి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి గౌతమి, డీసీహెచ్‌ఎన్ ప్రసూన, డీఐవో రాంబాబు, డీఎల్‌వో మాధవీలత పాల్గొన్నారు.
సత్తెనపల్లి: పెను ప్రమాదం త్రుటిలో తప్పిన సంఘటన సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం వద్ద గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాలెం మండలం ఉప్పలపాడు నుంచి పత్తి లోడుతో ట్రాక్టర్ గుంటూరు వెళుతుంది. అదే సమయంలో సత్తెనపల్లి వైపు నుంచి సిమెంటు లోడుతో లారీ గుంటూరు వెళుతుంది. ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన లారీ తగిలి పత్తి లోడు ట్రా క్టర్ ముందు చక్రం ఊడి పోవడంతో ట్రాక్టర్‌కు ఉన్న పత్తి లోడు ట్రక్కు బోల్తా కొట్టింది. కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిగా డాక్టర్ షేక్ సలీమ్ బాషా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియాను కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డీఈవో సలీమ్ బాషాను పలువురు ఎంఈవోలతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ తాను రెగ్యులర్‌గా పాఠశాలలను సందర్శిస్తానని, పాఠశాలల్లో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని చెప్పారు. విద్యాబోధన తీరుతెన్నులపై విద్యార్థులతో నేరుగా మాట్లాడతానని పేర్కొన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వేటపాలెం: పందిళ్లపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు హెచ్‌ఎం తలమల దీప్తి గురువారం తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో ఈనెల 9, 10 తేదీల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14 విభాగంలో రాష్ట్రస్థాయి బాల, బాలికల ఫెన్సింగ్ పోటీలు జరిగాయని తెలిపారు. పోటీల్లో ఆరో తరగతి విద్యార్థి ఎం.దీపక్ రామ్ హర్షిత్ ప్రతిభ కనపర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. విద్యార్థిని క్రీడల్లో ప్రోత్సహించడానికి స్టాఫ్ సెక్రటరీ బుద్ది మోహనరావు రూ.1000 బహూకరించి అభినందించారు. పీఈటీ కర్ణ నాగేశ్వరరావు, తోట వెంకటేశ్వర్లు అభినందించారు.
మాతృ మరణాలను నిరోధించాలి


