‘రొంపిచర్ల’ టీడీపీలో ముసలం
రొంపిచర్ల: మంత్రి లోకేశ్ పీఏ పేరుతో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు చేస్తున్న అరాచకాల నుంచి తమను కాపాడాలంటూ పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నంలో గ్రామ టీడీపీ నాయకులు గురువారం నిరాహారదీక్షకు దిగారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నాయకులు జాష్ఠి శ్రీనివాసరావు, జాష్ఠి ప్రసాదు, వెలగటూరి వెంకటనారాయణ నిరాహారదీక్ష చేపట్టారు. చల్లా సుబ్బారావు గత 18 నెలల కాలంలో చేసిన దందాలు, అక్రమవసూళ్లు, రౌడీలతో ఊళ్లో చేస్తున్న అల్లర్లు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగాలిప్పిస్తానని దళితవాడలో కొందరి నుంచి డబ్బు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అన్నవరపు పంతులు నుంచి రూ.1.50 లక్షలు తీసుకుని, అడిగితే బెదిరిస్తున్నారని తెలిపారు. పదవి ఇప్పిస్తానని జాష్ఠి ప్రసాద్‌తో రూ.10 లక్షల వరకు ఖర్చుచేయించినట్లు పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇళ్లపై రౌడీలతో దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపించారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.30 లక్షల బిల్లులను సైతం అడ్డుకుంటున్నాడన్నారు. కోడెల శివప్రసాద్ హయాంలో నిర్మించిన నీటిసంఘం భవనానికి రంగులు వేసి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల బిల్లు చేసుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఆ భవనం పక్కనున్న స్థలాన్ని సుబ్బారావు ఆధ్వర్యంలోనే ఆక్రమించారన్నారు. కోడెల ఆవిష్కరించిన మూడు శిలాఫలకాలను సుబ్బారావు ధ్వంసం చేశారన్నారు. ఈ విషయమై రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు పెట్టారని, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పారు. సుబ్బారావు అరాచకాల గురించి ఎమ్మెల్యే అరవిందబాబుకు, ఎంపీకి, ఇన్‌చార్జి మంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. వీరవట్నంలో తెలుగుదేశం నాయకులు నిరాహారదీక్ష చేస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు వెళ్లి మాట్లాడి విరమింపజేశారు. గ్రామంలో పార్టీ నాయకులు కూడా ఆందోళనకు దిగినవారికి సర్దిచెప్పారు.
టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సుబ్బారావు నుంచి తమను కాపాడాలంటూ వీరవట్నంలో పార్టీ నేతల నిరాహారదీక్ష
లోకేశ్ పీఏ పేరుతో సుబ్బారావు చేసిన అరాచకాలంటూ ఫ్లెక్సీ ఏర్పాటు
‘రొంపిచర్ల’ టీడీపీలో ముసలం


