టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణతకు ప్రథమ ప్రాధాన్యం
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారిగా పి.వి.జే.రామారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణాజిల్లా డీఈఓగా పనిచేస్తున్న రామారావు పల్నాడు జిల్లాకు బదిలీపై వచ్చారు. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన రామారావును పలువురు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు సంఘం, ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించటమే ప్రథమ ప్రాధాన్యతగా గుర్తిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక మేరకు ఉత్తమ ఫలితాలు సాధిస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు.
మెగా డిఎస్‌సీ– 2025 ఉపాధ్యాయ నియామకాలతో పాటు విద్యా వాలంటీర్లను ప్రభుత్వం నియమించిందని వివరించారు. అలాగే ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక గెజిటెడ్ అధికారిని పరిశీలకునిగా నియమిస్తున్నదని తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన 100 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులను షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్‌గా విభజించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ఒక్కో సబ్జెక్ట్‌లో స్లిప్ టెస్ట్‌లు నిర్వహిస్తూ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా బోధన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పది విద్యార్థుల నూరు శాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు, సిబ్బంది సహకరించాలని కోరారు. జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారంతో పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
జిల్లా డీఈఓగా పి.వి.జే.రామారావు బాధ్యతలు స్వీకరణ


