చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై గ్రామాల్లోనూ నిరసన వెల్లువ
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రయివేటీకరణపై ప్రజా వ్యతిరేకత వైఎస్సార్‌సీపీ ‘కోటి సంతకాల సేకరణ’కు అనూహ్య స్పందన పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ పేదలకు, పేద విద్యార్థులకు అన్యాయం చేసేలా మెడికల్ కళాశాలలను ప్రయివేటీకరించడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని, వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ జిల్లాలో విజయవంతమైందని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ జరిపిన అనంతరం ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంతకాల పత్రాల వాహనాన్ని జెండా ఊపి పంపారు. మాచర్ల నియోజక వర్గంలో మొత్తం 72,452 మంది సంతకాలు చేశారని పేర్కొన్నారు.
నరసరావుపేట నియోజకవర్గంలో..
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాలకు విశేష స్పందన లభించిందని, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పేపర్ బాక్స్‌లను బుధవారం లింగంగుంట్లలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి తరలించారు. గుంటూరు రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు గుత్తికొండ అంజిరెడ్డిలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నియోజకవర్గంలో 62,500 సంతకాలు సేకరించారు..
చిలకలూరిపేట నియోజకవర్గంలో...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సమర శంఖారావాన్ని వైఎస్సార్ సీపీ పూరించిందని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ రోడ్డులో ఉన్న మాజీమంత్రి నివాసం నుంచి నియోజకవర్గ పరిధిలో సేకరించిన సంతకాలను జిల్లా కేంద్రానికి పంపే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కరరెడ్డితో కలసి సంతకాల ప్రతులు ఉన్న వాహనాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించించారు.
వినుకొండ నియోజకవర్గంలో...
కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో పూర్తి చేసిన 63వేల సంతకాల ప్రతులను బుధవారం భారీ ర్యాలీగా నరసరావుపేట జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ఐదు మండలాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో...
కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమం చంద్రబాబు ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడుతుందని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమంలోని 66,507 ప్రతులను బుధవారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు తరలించారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో...
పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 55వేల మంది ప్రజలు పీపీపీని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారని పెదకూరపాడు మాజీ శాసన సభ్యుడు నంబూరు శంకరరావు అన్నారు. క్రోసూరు వైఎస్సార్సీపీ కార్యాయలంలో కోటి సంతకాల ఉద్యమ ప్రతులను పార్టీ జిల్లా కార్యాలయానికి తరలిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గురజాల నియోజకవర్గంలో...
కోటి సంతకాల కార్యక్రమం ప్రజా ఉద్యమంలా జరిగిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సంతకాల కాపీల బాక్సులను పల్నాడు జిల్లా కేంద్రానికి పంపించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాసు మహేష్‌రెడ్డి ముందుగా సంతకాల సేకరణ బాక్సులను పరిశీలించి, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జెండాను ఊపి వాహనాన్ని ప్రారంభించారు.
క్రోసూరులో సంతకాల పత్రాలు ఉన్న వాహనాన్ని జెండా ఊపి
ప్రారంభిస్తున్న పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై గ్రామాల్లోనూ నిరసన వెల్లువ


