రండి .. ప్రధానితో మాట్లాడండి
విద్యార్థులకు ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనే అవకాశం ఆన్‌లైన్‌లో వివరాల నమోదుకు జనవరి 11వ తేదీ తుది గడువు
సత్తెనపల్లి: ప్రధాన మంత్రితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా, ఇప్పుడు ఆ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రధానమంత్రి ‘పరీక్షా పే చర్చ’ యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు కావాలి. ఏటా పరీక్షలకు ముందు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్థంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో పరీక్షలకు సమాధానాలు రాయడం ద్వారా విద్యార్థులకు పరీక్షలు అంటే భయాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు అర్హులు. విద్యార్థులు తమ ప్రశ్నను ప్రధానమంత్రిని నేరుగా అడగవచ్చు. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాలలోపు ఉండాలి. ఇందులో తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్‌లైన్‌లో పంపే అవకాశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కల్పించింది. వీటిలో మంచి ప్రశ్నలను ఎంపిక చేసి అర్హులను నిర్ణయిస్తారు.
విజేతలుగా నిలిస్తే...
‘పరీక్షా పే చర్చ’లో విజేతలు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి విజేతకు ప్రత్యేక కిట్ అందజేస్తారు. విజేతలకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. విజేతలు ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి ఆటోగ్రాఫ్, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్ పొందే అవకాశం ఉంది.
లాగిన్ ఇలా...
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హెచ్‌టీటీపీఎస్://ఇన్నోవేటివ్‌ఇండియా.మైజీవోవీ.ఇన్ అని క్లిక్ చేయాలి. ఎంటర్ కాగానే క్లిక్ ఏజ్ స్టూడెంట్, టీచర్, పేరెంట్స్ అనే లాగిన్స్ కనిపిస్తాయి. వాటిలోకి ఎంటర్ కాగానే మీ మొబైల్ నెంబర్ లేదా జీమెయిల్ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్ అయి క్లిక్ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్ చేయాలి. స్టూడెంట్స్ నేరుగా ఫోన్ నెంబర్, జీమెయిల్ లేని సందర్భంలో టీచర్స్ లాగిన్ ద్వారా ప్రవేశ అవకాశం కల్పించారు. ఆన్‌లైన్లో నమోదు చేసుకునేందుకు 2026 జనవరి 11 వరకు గడువు ఇచ్చారు. విద్యార్థులు/ ఉపాధ్యాయులు/తల్లిదండ్రులు ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి. కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్‌ను ఎంచుకొని 500 అక్షరాల లోపు వివరించాలి.


