అనైతిక బంధం..అంతం !
నరసరావుపేట టౌన్: నరసరావుపేట పట్టణం పెద్ద చెరువు రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసిస్తున్న త్రోవగుంట బాల సుబ్రమణ్యాచారికి శ్రీలక్ష్మి (35)తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేరు. సుబ్రహ్మణ్యాచారి హార్డ్‌వేర్ షాపు నిర్వహిస్తుంటాడు. భార్య శ్రీలక్ష్మికి పట్టణానికి చెందిన షేక్ బాజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కొద్ది రోజులకు భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తన భార్య జోలికి రావద్దని బాజీని హెచ్చరించాడు. అయినా లెక్క చేయకుండా శ్రీలక్ష్మితో ఫోన్‌లు చేసి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో బాజీని హతమార్చాలని నిర్ణయించుకుని అత్త రాంబాయమ్మతో కలిపి పథకం పన్నాడు. ఈ క్రమంలో గత నెల 24వ తేదీన బాజీ ఎస్‌ఆర్‌కేటీ కాలనీ వద్ద హోటల్‌లో ఒంటరిగా ఉన్నాడని తెలుసుకొని సుబ్రహ్మణ్యాచారి, రాంబాయమ్మ కలిసి హతమార్చారు. వీరిద్దరినీ గత శనివారం నరసరావుపేట రూరల్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. బాజీ మృతి చెందడం, తల్లి, భర్త కటకటాల పాలవడంతో శ్రీలక్ష్మి మానసికంగా కుంగిపోయింది.
ములాఖత్‌లో చివరి పలకరింపు.. రాత్రికి బలవన్మరణం..
సబ్‌జైల్లో ఉన్న భర్త, తల్లిని ములాఖత్ ద్వారా శ్రీలక్ష్మి మంగళవారం కలిసింది. అక్కడ ఏం జరిగిందో ఏమో ... అర్ధరాత్రి సమయంలో శ్రీలక్ష్మి ఉరేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆమె సోదరుడు మల్లిఖార్జునరావు పిలిచినా పలకపోవడంతో అనుమానంతో గది తలుపులు పగలగొట్టి చూశాడు. ఉరేసుకుని కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ ప్రభాకర్, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వివాహేతర బంధం నేపథ్యంలో వ్యక్తి హత్య
కటకటాల పాలైన వివాహిత భర్త, తల్లి
చివరకు ఉరేసుకున్న వివాహిత
నరసరావుపేటలో కలకలం రేపిన ఘటన
ఆకర్షణ పునాదులపై కట్టుకున్న తాత్కాలిక ప్రేమ సౌధం అర్ధంతరంగా కూలిపోయింది. కనిపెంచిన తల్లి, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త కటకటాల పాలవగా పశ్చాత్తాపంతో నిలువునా కుంగిపోయింది. కట్టుకున్నోడు దూరం కాగా.. కలుపుకొన్న బంధం మట్టిలో కలిసిపోగా.. ఒంటరి జీవితాన్ని భరించలేక, జీవచ్ఛవంలా బతకలేక తానూ ఉరికొయ్యకు వేలాడింది. అనైతిక బంధాల ఉచ్చులో పడి నరసరావుపేటలో ఓ మహిళ నిండు ప్రాణాలు బలి తీసుకుంది.
అనైతిక బంధం..అంతం !


