విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
●అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు
●సూపర్‌వైజర్, అంగన్‌వాడీ కార్యకర్త, ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు
నకరికల్లు: విధి నిర్వహణలో అలసత్వం వ్యవహరించినా, పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలకు పాల్పడినా కఠినచర్యలు తప్పవని ఫుడ్ కమిషన్ మెంబర్ ఈ.లక్ష్మీరెడ్డి హెచ్చరించారు. ఆహార భధ్రత చట్టం అమలులో భాగంగా ఫుడ్‌కమిషన్, ఐసీడీఎస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు మండలంలోని నర్శింగపాడు, నకరికల్లు, దేచవరం గ్రామాల్లోని అంగన్‌వాడీకేంద్రాలు, ప్రభుత్వపాఠశాలల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బియ్యం, కోడిగుడ్లు, సరుకుల నిల్వలు, వంటగదులు, పరిశుభ్రత, రిజిస్టర్‌ల నిర్వహణ తదితర అంశాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్టర్ నిర్వహణలో తప్పులు, గర్భిణులకు కోడిగుడ్లు పంపిణీలో నిబంధనలు పాటించకపోవడంతో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ షేక్.రమీజున్, నర్శింగపాడు–2 అంగన్‌వాడీ కార్యకర్త కృష్ణవేణికు షోకాజ్ నోటీస్ జారీచేయాలంటూ ఐసీడీఎస్ పీడికి సిఫారసు చేశామన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలో వండించకుండా బయట వండించి తీసుకువస్తున్న కారణంగా ప్రాథమికపాఠశాల ఉపాధ్యాయురాలు బి.శివకుమారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఎంఈఓకు ఆదేశాలు జారీచేశారు. ఐసీడీఎస్ సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం నకరికల్లులోని ఉన్నతపాఠశాలలో మధ్యాహ్నభోజనం చేసి అభినందించారు. కార్యక్రమంలో ఐసీడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమారాణి, డిఎస్‌ఓ ఎం.వి.ప్రసాద్, జీసీడీఎస్‌ఓ శ్రీలత, జీసీడీఓ దొండేటి రేవతి, డిప్యూటి డీఈఓ ఏసుబాబు, తహసీల్దార్ కె.పుల్లారావు, డిప్యూటి తహసీల్దార్ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు


