రూ.12.28 లక్షల బయో ఉత్పత్తులు స్వాధీనం
నరసరావుపేట రూరల్: తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.12,28,740 విలువైన బయో ఉత్పత్తులు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన విజిలెన్స్ అధికారులు పట్టణంలోని పార్సిల్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న వివిధ కంపెనీల బయో ఉత్పత్తులను నిలుపుదల చేశారు. వ్యాపారులు అందజేసిన బిల్లులు, అనుమతి పత్రాలను పరిశీలించిన అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ నుంచి బయో ఉత్పత్తులు రవాణా చేస్తున్నట్టు నిర్దారించారు. ఈ మేరకు రూ.12లక్షల విలువైన 188.8లీటర్ల ఆరు రకాల బయో ఉత్పత్తులను వ్యవసాయ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏవో సీహెచ్ ఆదినారాయణ, సీఐ కె.చంద్రశేఖర్, నరసరావుపేట ఏవో ఐ.శాంతి పాల్గొన్నారు.


