టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ
వినుకొండ: వినుకొండ రూరల్ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ వీరగంధం వెంకటసుబ్బారావుకు చెందిన 4.22 ఎకరాలు ఎలాంటి ఆధారాలు లేకుండా గ్రామానికి చెందిన అదే పార్టీ నాయకుడు వీరగంధం రత్తయ్య ఆన్‌లైన్‌లో తనపేరు ఎక్కించుకున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ మేనల్లుడు ముండ్రు సత్యనారాయణ, అతని కుమారుడు వెంకటేశ్వర్లు ఈ ఏడాది జూలై నెలలో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయం జరగకపోవడంపై కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కోర్టులో సోమవారం ఇరువర్గాలను పిలచి విచారించే క్రమంలో అక్కడకు వచ్చిన వీరగంధం రత్తయ్య, అతని కుమారుడు అజయ్, గ్రామసర్పంచ్ వీరగంధం ఆనంద్, మక్కెన శ్రీనులు మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు వెంకటేశ్వర్లుపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరచారు. బాధితుడు పక్కనే ఉన్న పోలీస్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసే క్రమంలో స్టేషను ముందు కూడా దాడి చేసి గాయపరచారు. బాధితుడు చికిత్స కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాడు.
స్వామి మాలలో ఉన్నా దాడులు
శివస్వామి మాలలో ఉన్నప్పటికీ కనికరం లేకుండా తనపై కర్రతో దాడి చేశారని శ్రీశైలం వెళ్లి దీక్ష విరమంచే సమయంలో ఈ రోజు దాడిచేశారని బాధితుడు వాపోయాడు. టీడీపీ ప్రభుత్వంలో పార్టీ నాయకులకే రక్షణలేదని, భూములకు కూడా రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. గ్రామంలో ఎస్సీ ఎస్టీల భూములు కూడా ఆక్రమణకు గురయ్యాయని, కనీసం రక్షణ లేకపోవటంతో 40 కుటుంబాలు గ్రామం విడచి వెళ్లాలని చూస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ అధికారులే టీడీపీ కార్యకర్తల మాదిరిగా భయం లేకుండా ఎవరి భూములైనా మరొకరి పేరుతో ఆన్‌లైన్ చేస్తున్నారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను వేడుకున్నాడు.
టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ


