ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలి!
●80ఏళ్ల వృద్ధుడు మురుగు కాలువ బాగు చేసుకునే పరిస్థితి దారుణం
●గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: ఓ 80ఏళ్ల వృద్ధుడు ఇంటి ముందు మురుగు కాలువను బాగు చేసుకోవడం పురపాలక సంఘ పరిస్థితికి అద్దం పడుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ నరసరావుపేటలో భాగంగా ఆదివారం ఐదో వార్డు క్రిస్టియన్‌పాలెం, శివసంజీవయ్య కాలనీలో ఆయన పర్యటించారు. శివసంజీవయ్య కాలనీలో అల్లూరి బాలయ్య అనే ఓ వృద్ధుడు ఇంటిముందున్న కాలువలోకి దిగి బాగు చేసుకోవడాన్ని పరిశీలించారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి మున్సిపాల్టీలో ఉందా? అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. పట్టణంలో 80ఏళ్ల వ్యక్తి కాలువలోకి దిగి శుభ్రం చేసుకునే పరిస్థితి రావటం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి తక్షణమే ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


