నేటి నుంచి అండర్–17 ఫుట్‌బాల్ టోర్నీ
నరసరావుపేట రూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ అంతర జిల్లాల అండర్–17 బాలబాలికల పుట్‌బాల్ పోటీలకు సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియం, ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానాలు సిద్ధమయ్యాయి. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జట్లు పాల్గొననున్నాయి. బాలుర జట్లు డీఏస్‌ఏ స్టేడియంలో, బాలికల జట్లు ఈశ్వర్ మైదానంలో తలపడనున్నాయి. దాదాపు 520 మంది క్రీడాకారులు, 80మంది కోచ్‌లు పోటీలకు హజరుకానున్నారు. వీరికి వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈనెల 7వ తేదీ పోటీల ప్రారంభంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఈవో చంద్రకళ పాల్గొంటారని జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.సురేష్‌కుమార్, అడ్మిన్ సెక్రటరీ వి.పద్మావతి తెలిపారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి
గుంటూరు మెడికల్: జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కోల్డ్ చైన్ పరికరాలు, ఐఎల్‌ఆర్, డీప్ ఫ్రీజర్, వ్యాక్సిన్ క్యారియర్, ఐస్ ప్యాక్ పాడవకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్టులదేనని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వైద్యులు, వైద్య సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఫార్మాసిస్టులు లేని చోట స్టాఫ్ నర్సులను, ఎంపీహెచ్‌ఎస్ సిబ్బందికి కోల్డ్ చైన్ పరికరాలు పాడవకుండా నిర్వహణ బాధ్యతలను వైద్యాధికారి అప్పజెప్పాలన్నారు. తప్పనిసరిగా వ్యాక్సిన్లు ఏవిధంగా నిల్వ ఉన్నాయి, వాటి కాలపరిమితి ఎప్పటి వరకు ఉంది తదితర విషయాలను ప్రతిరోజూ మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెలలో జరుగనున్న పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కోల్డ్‌చైన్ సిస్టాన్ని పరిశీలించాలన్నారు. డీపీఎంఓ డాక్టర్ కె.సుజాత మాట్లాడుతూ ప్రతి ఫార్మసీ అధికారి తమకు కేటాయించిన సమయాల్లో పీహెచ్‌సీ లేదా అర్బన్ పీహెచ్‌సీల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. ఫార్మసీని, స్టోర్స్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతిదీ తప్పనిసరిగా రికార్డులో నమోదు చేయాలని తెలిపారు.


