సామాజిక మాధ్యమంలో మార్ఫింగ్ ఫొటోలు
లక్ష్మీపురం: ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఓ మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేక్ ఐడీతో ఫేస్‌బుక్‌లో పెట్టిన వ్యక్తిని సాంతకేతిక పరిజ్ఞానంతో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అరెస్ట్ చేశారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో శనివారం సీఐ వివరాలు వెల్లడించారు. జేకేసీ కళాశాల రోడ్డులో నివాసం ఉండే ఓ మహిళకు చెందిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టి వేధింపులకు గురి చేస్తున్నట్లు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మార్ఫింగ్ చేసిన ఫొటోలు ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, కృష్ణంశెట్టి పల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి మధుసూదనరెడ్డిని శనివారం మధ్యాహ్నం అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో మధుసూదనరెడ్డి జేకేసీ కళాశాల రోడ్డులో నివాసం ఉండే బంధువు అయిన ఒక మహిళతో తరచుగా ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవాడె, అయితే సుమారు మూడు నెలల క్రితం మధుసూదనరెడ్డి మహిళకు ఫోన్ చేసినప్పుడుల్లా కట్ చేయడం, సరిగా మాట్లాడక పోవడం.. తన ఫోన్ లిఫ్ట్ చేయకుండా వేరే మహిళతో ఎక్కువ సమయంలో ఫోన్‌లో మాట్లాడుతున్నదనే కోపంతో రగిలిపోయాడు.
ఆమెను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఫొటోలను ఫేస్ బుక్‌లో సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి వేరే వారి పేరుతో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి పోస్ట్ చేసినట్లు అంగీకరించాడు. సోషల్ మీడియాను మంచికి వాడాలని సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పట్టాభిపురం ఎస్‌ఐ నరేంద్ర, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు


