ఆయిల్ పామ్‌కు మార్కెట్‌లో డిమాండ్
సత్తెనపల్లి: ఆయిల్ పామ్‌కు మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని శాస్తవేత్త సుభాష్ శ్రీ సంజయ్ తెలిపారు. ఏటా రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టి విదేశాల నుంచి 150 లక్షల టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు, లక్కరాజు గార్లపాడు గ్రామాల్లో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు శనివారం ఉద్యాన శాఖ, గోద్రెజ్ ఆగ్రోవేట్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇతర పంటలతో పోలిస్తే పెట్టుబడి ఖర్చు పోను ఎకరాకు నికరంగా రూ. లక్షకు పైగా ఆదాయం వస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో రైతులు పాటించాల్సిన మెళకువలు, యాజమాన్య పద్ధతులు గురించి వివరించారు. సత్తెనపల్లి ఉద్యాన అధికారి యన్. సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఆయిల్ పామ్ మొక్కలు ఖరీదు పై 100 శాతం రాయితీ వస్తుందని తెలిపారు. ప్రోత్సాహంలో భాగంగా అంతర పంటల సాగుకు హెక్టారుకి నాలుగు సంవత్సరాలకు గాను రూ. 21 వేలు మించకుండా రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్ నరేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీల గురించి వివరించారు. గోద్రెజ్ ఆగ్రోవేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ కంపెనీ ద్వారా ఆయిల్ ఫామ్ గెలల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాకాలపాడు పీఏసీఎస్ చైర్మన్ కొణికినేని సత్యనారాయణ, గోద్రెజ్ కంపెనీ సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్లు జి.వి. రమణ, కె. నాని, ఐ.జగదీశ్ పాల్గొన్నారు.
శాస్తవేత్త సుభాష్ శ్రీ సంజయ్


