శివాపురం గ్రామంలో విషాదఛాయలు
వినుకొండ: మండలంలోని శివాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. గుంటూరు విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మేరుగ శ్రీకాంత్‌రెడ్డి (21) ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన వేరుగ సుబ్బారెడ్డి, కృష్ణకుమారి దంతులకు ఇరువురు సంతానం. వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేయాలని కష్టపడి చదివిస్తున్నారు. మొదటి సంతానమైన శ్రీకాంత్‌రెడ్డి ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, రెండో కుమారుడు భీమవరంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శ్రీకాంత్‌రెడ్డి మృతిని తట్టుకోలేక తల్లి కృష్ణకుమారి విలపిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. శ్రీకాంత్‌రెడ్డితో చదువుకునే సహచర విద్యార్థులు, యూనివర్సిటీ ఉపాధ్యాయులు కూడా గ్రామానికి వచ్చి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


