మిస్టరీగా మారిన ఘోర రోడ్డు ప్రమాదం
వెహికల్ చెకింగ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ కాదంటూ ఆర్‌టీఏ అధికారులు ప్రతికా ప్రకటన భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నాదెండ్ల/యడ్లపాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన రాత్రి పూట హైవేపై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ఒకరు వాహనాల తనిఖీ చేపట్టారని, తనిఖీల్లో భాగంగా భారీ ట్రైలర్ లారీని, దానితో పాటు మరో వాహనాన్ని బైపాస్ రోడ్డుపై వెంబడించి ఓవర్ టేక్ చేశారని వాటిని పక్కకు తీసుకురావాలని ఆదేశించడంతో ట్రైలర్ ఒక్కసారిగా ఎడమవైపునకు తిప్పారని, అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న కారులోని విద్యార్థులు గమనించి ట్రైలర్‌ను తప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వేగంలో ఉన్న కారు అప్పటికే ట్రైలర్ వెనుక ఢీకొని టాప్ మొత్తం ముక్కలై హైవేపై చెల్లాచెదురుగా పడ్డాయి. కారు మొత్తం పూర్తిగా లారీ కిందకు దూసుకువెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే బ్రేక్ ఇన్‌స్పెక్టర్ అక్కడి నుంచి జారుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రచారం అవాస్తవం
–ఆర్టీఏ అధికారుల స్పష్టీకరణ
చిలకలూరిపేట బైపాస్‌లో శుక్రవారం సాయంత్రం ఐదుగురు విద్యార్థుల మృతికి కారణమైన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పల్నాడు జిల్లా రవాణా శాఖ (ఆర్.టి.ఏ) అధికారులు స్పందించారు. ఇందుకు సంబంధించి జిల్లా రవాణా అధికారి (డి.టి.ఓ) జి. సంజయ్ కుమార్ శుక్రవారం ఒక పత్రికా ప్రకటన వెలువరించారు. సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదిగా ఆయన ఖండించారు. హైవే కంట్రోల్ సెంటర్ కెమెరా ఫుటేజీలను పరిశీలించామని, ప్రమాద స్థలంలో ఉన్న టీఎస్ 08 హెచ్ వై 3158 నంబరు గల వాహనం తమ శాఖలో ఏ అధికారి ఉపయోగించడం లేదని పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. వాహనం నుంచి దిగిన వ్యక్తులు కూడా ఆర్‌టీఏ ఉద్యోగులు కారని తెలియజేస్తూ, అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. అయితే నిలుపుదల చేసిన ఆ కారు ఎక్కడిది, ఎవరిదీ, అందులో ఉన్న వారు అధికారులా లేక నకిలీలా అన్న భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
మిస్టరీగా మారిన ఘోర రోడ్డు ప్రమాదం


