రేపు నరసరావుపేటలో యూనిటీ ర్యాలీ
నరసరావుపేట: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతి సందర్భంగా బుధవారం యూనిటీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీఆర్‌ఓ ఏకా మురళి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల నుంచి ప్రారంభమయ్యే ర్యాలీలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి పాదయాత్ర యూనిటీ ఎట్ ది రేట్ ఆఫ్ 150పై సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆర్డీఓ మాట్లాడారు. ర్యాలీ యువతలో స్ఫూర్తి నింపనున్నదని పేర్కొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని స్మరించుకోవడానికి సర్దార్:150 యూనిటీ మార్చ్ మేరా యువ భారత్ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారన్నారు. విభజిత భారతాన్ని ఏకతా సూత్రంలో కట్టిన సర్దార్ పటేల్ నాయకత్వ ఆదర్శాలను ‘‘ఏక్ భారత్ –ఆత్మ నిర్భర్ భారత్’’గా యువత తమ జీవన విధానంలో అనుసరించమని ప్రేరేపించడం ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. దీనిలో యువత, విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మై భారత్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఉప సంచాలకులు దేవిరెడ్డి కిరణ్మయి మాట్లాడుతూ యూనిటీ మార్చ్ మై భారత్ గుంటూరు, బాపట్ల జిల్లా పరిపాలన విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా రీల్ పోటీ, నిబంధ రచనా పోటీ, సర్దార్:150 యువ నాయకుల కార్యక్రమంలో పాల్గొని ఎంపికై న 150 మంది విజేతలకు జాతీయ పాదయాత్రలో పాల్గొనే అవకాశం కలుగుతుందని అన్నారు. బీజేవైఎం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్ పులిగుజ్జు మహేష్ మాట్లాడుతూ యువత ఈ చారిత్రక కార్యక్రమంలో భాగస్వాములై యూనిటీ మార్చ్‌ని విజయవంతం చేయాలని కోరారు. ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ అన్నదాసు సరళకుమారి పాల్గొన్నారు.


