హైవేపై డెత్ స్పాట్స్
తరచూ రోడ్డు ప్రమాదాలు.. రక్షణ చర్యలు శూన్యం
దాచేపల్లి : రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ..ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోవటం..నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి కారణాలతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపొతున్నాయి. రహదారుల్లో కొన్ని చోట్ల డెత్ స్పాట్‌లు ఉంటున్నాయి. దాచేపల్లి మీదుగా హైవే రోడ్డు ఉంది. ఈ రోడ్డు మీదుగా రోజుకు వేల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, నరసరావుపేట, అద్దంకి, నెల్లూరు, తిరుపతి, చైన్నెలకు రాకపోకలు సాగిస్తుంటాయి. హైవేపై సరైన భద్రత చర్యలు చేపట్టలేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరిగి వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు క్రాసింగ్‌ల వద్ద రక్షణ చర్యలు తీసుకోకపోవటం, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవటం, రోడ్డుపై ఎక్కడ ఎంత మేరలో వేగంతో వెళ్లాలనే బోర్డులు ఏర్పాటు చేయలేదు. హైవేపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వాహనదారులు వేగ నియంత్రణ చర్యలు తీసుకోకపొవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
డెత్ స్పాట్స్
దాచేపల్లి పట్టణ పరిధిలో హైవేపై డెత్‌స్పాట్‌లు ఉన్నాయి. నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద హైదరాబాద్, మాచర్ల, నాగార్జునసాగర్ వెళ్లే వాహనాలు రోడ్డు క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హెచ్చరిక బోర్డులు లేకపోవటం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. నారాయణపురం ఆర్‌అండ్‌బీ బంగ్లా సెంటర్, కారంపూడి రోడ్డు సెంటర్, ముత్యాలంపాడు రోడ్డు సెంటర్, గామాలపాడు దాబా సెంటర్‌లలో తరచూ రోడ్డు ప్రమా దాలు జరుగుతున్నాయి.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు
నడికుడి వ్యవసాయ మార్కెట్‌యార్డు వద్ద రోడ్డుపై వెళుతున్న దాచేపల్లికి చెందిన తాటిపర్తి విజయ్‌కుమార్‌రెడ్డిని అతివేగంతో వస్తున్న కారు ఢీ కొట్టటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతివేగంతో కారు నడపటంతో పాటు మద్యం తాగి ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఇక్కడ మరో కారు వేగ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన దుకాణంలోకి దూసుకెళ్లింది. ఇక ముత్యాలంపాడు రోడ్డు సెంటర్‌లో లారీ అదుపుతప్పి టిఫిన్ దుకాణంలోకి దూసుకెళ్లటంతో అందులో పనిచేస్తున్న కార్మికుడు మృత్యువాత పడ్డాడు. గామాలపాడు దాబా సెంటర్‌లో అతివేగం కారణంగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి దుకాణంలోకి దూసుకెళ్లటంతో ఒకరు మృతిచెందారు.
హైవేపై డెత్ స్పాట్స్


