బాల్యంలోనే జీవన విలువలు, నైపుణ్యాల విద్య నేర్పాలి
జన విజ్ఞాన వేదిక నేత
డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి
నరసరావుపేట: నేటి పాఠశాలల్లో అమలులో ఉన్న పుస్తకాల చదువులకు బదులు బాల్యం నుంచే పిల్లలకు జీవన విలువలు, నైపుణ్యాల గురించిన శిక్షణను ఇచ్చి, భావి జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, కష్టనష్టాలను నిబ్బరంగా ఎదుర్కొనగల పునాదిని ఏర్పరచాలని జన విజ్ఞాన వేదిక వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం లింగంగుంట్ల కాలనీలోని ఎస్‌టీయూ భవన్‌లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం, పల్నాడు జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ‘తరగతి గదిని ఆహ్లాదకరంగా మార్చడం ఎలా‘ అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పలు అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఎస్టీయూ నాయకులు ఎస్.ఎం.సుభాని అధ్యక్షత వహించారు. డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఫిన్లాండ్ దేశంలో విద్య, వైద్యంపై ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేస్తారని, పిల్లలకు ఆరో తరగతి వరకు పుస్తకాలు ఉండవని, పౌర నీతి, సామాజిక స్పృహ ప్రశ్నించే తత్వం, తమ భాషలో చక్కగా మాట్లాడటాన్ని నేర్పిస్తారని, ఇట్టి విద్యావిధానం మన రాష్ట్రం, దేశంలో కూడా రావాలన్నారు. నాయకులు బి.విశ్వనాథ, చేజర్ల చలమారెడ్డి, మేకల నరసింహారెడ్డి, బి.కృష్ణయ్య, కొండమ్మ, సేతు రామేశ్వర్, లింగిశెట్టి ఈశ్వరరావు, ఈదర గోపీచంద్, కరీముల్లా, పి వెంకయ్య, మల్లికార్జున, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు పాల్గొన్నారు.


