అమ్మో పులి
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిసరాల్లో పులి సంచారం వజ్రాలపాడ తండా అటవీ ప్రాంతంలో శని, ఆదివారాల్లో రెండు గేదెలను చంపిన పులి భయాందోళనలో ఆటవీ సమీప ప్రాంత పశు కాపరులు, రైతులు నల్లమల టైగర్ జోన్ నుంచి జిల్లా అటవీప్రాంతంలోకి వచ్చినట్టు భావిస్తున్న అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన అటవీశాఖకు సహకరిస్తున్న వేట నియంత్రణ దళాలు, పశువుల కాపరులు, స్థానిక రైతులు
రక్షణ కోసం చర్యలు
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న మండలాల్లో పులుల సంచరిస్తున్నాయన్న సమాచారంతో స్థానికులు హడలిపోతున్నారు. వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండాలో శనివారం, ఆదివారాలలో మేతకు వెళ్లిన రెండు గేదెలు ప్రాణాలు కోల్పోయాయి. గేదెలు మరణించిన తీరు, అక్కడి పాదముద్రల ఆధారంగా పులి చంపినట్టు అటవీ అధికారులు నిర్దారణకు వచ్చారు. దీంతో ఏ సమయంలో పులులు దాడులు చేస్తాయోనని ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం అయితే ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ రేంజ్‌లో ఇటీవల కాలంలో అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిన పశువులను పెద్దపులి వేటాడి చంపిన ఘటనలు అనేకం ఉన్నాయి. రెండేళ్ల కిందట దుర్గి మండలం గజాపురం అటవీ ప్రాంతంలో ఓ ఆవును అడవి జంతువులు వేటాడి చంపాయి. ఆ ప్రదేశంలో ఉన్న పాద ముద్రికల ఆధారంగా రెండు పులులు దాడి చేసి నట్టు అటవీశాఖ అధికారులు అప్పట్లో నిర్ధారించా రు. పల్నాడు జిల్లా అడవులకు ఆనుకొని ఉన్న నల్లమల టైగర్ జోన్ నుంచి పులుల సంచారం పెరగడంతో ఆ ప్రాంత ప్రజల్లో గుబులు మొదలైంది.
పెరుగుతున్న పులుల సంఖ్య...
శ్రీశైలం, నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల మధ్య ఉన్న నల్లమల అభయారణ్యంలో పులుల సంతతి కొన్నేళ్లుగా బాగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 85 దాకా ఉందని అటవీశాఖ అధికారిక లెక్కల ప్రకారం చెబుతున్నా, అనధికారికంగా మరి కొన్ని పులులు ఉండవచ్చని భావిస్తున్నారు.
టైగర్ జోన్‌ను ఆహార వేట కోసం పులులు పల్నాడు జిల్లా శివారు తండాల వైపు వచ్చి ఉంటాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలాల పరిధిలోని నల్లమల అటవీ సమీప ప్రాంతాలలో పులులు సంచరించే అవకాశం ఉందని, ఆ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చిరిస్తున్నారు.
వివిధ కారణాలతో జనారణ్య సమీపంలోకి వచ్చిన పులులను ఇబ్బందిపెట్టవద్దని ప్రజలకు అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అటవీ, వేట నిరోధక దళాలు, వనమిత్రల సహాయంతో పులుల జాడ తెలుసుకొని, వాటి మార్గాలను టైగర్ జోన్ వైపు మళ్లించే యత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. రైతులు తమ పంటలను కాపాడు కోవడానికి పొలాల చుట్టు వేసే విద్యుత్ కంచెల బారిన పడి మరణించకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాలలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు నిత్యం రాత్రిపూట గస్తీ పెంచారు. ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. వజ్రాలపాడు తండా సమీపంలోని నాలుగు గ్రామాలలో సోమవారం అటవీ శాఖ దండోరా వేయించింది. పులి సంచారం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం అందిస్తున్నట్టు సమాచారం. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పాదముద్రలను పరిశీలించి వరుసగా రెండు రోజులు ఒకే పులి దాడిచేసిందా లేదా వేర్వేరు పులులు దాడి చేశాయా అనే కోణంలో అటవీ
అధికారులు పరిశీలిస్తున్నారు.
అమ్మో పులి
అమ్మో పులి


