పత్తి కొనుగోలుకు ఈ క్రాప్ తప్పనిసరి
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
పిడుగురాళ్ల: పత్తి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలంటే రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదై ఉండాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. పట్టణంలోని జానపాడులో ఉన్న పత్తి మిల్లులో పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యాన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ముందుగా పిడుగురాళ్లలోనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని, ఈ ప్రాంతంలో సమ్మర్ క్రాప్ కూడా వేయడంతో కొనుగోలు కేంద్రాలను ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 11 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 85 వేల హెక్టార్లలో పత్తి సాగు చేయగా సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.8110కు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. తేమ 8 నుంచి 12 శాతంలోపు ఉండాలని పేర్కొన్నారు. ఈ ఏడాది పత్తి దిగుబడి ఎక్కువగా ఉన్నందున కొనుగోలు కేంద్రాన్ని ముందుగానే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియమ నిబంధనలు ఈ ఏడాది పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నందున వ్యవసాయ శాఖ అధికారులకు, రైతులకు ఇప్పటికే పత్తి కొనుగోలు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.


