అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం కావాలి
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)వేదికలో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలలు నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 132 అర్జీలు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఇతర జిల్లా అధికారులతో కలసి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా సంతృప్తే ధ్యేయంగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీలు రీ–ఓపెన్ కాకుండా పరిష్కార చర్యలు ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్య తెలుసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


