నష్టం అపారం...సాయం స్వల్పం | - | Sakshi
Sakshi News home page

నష్టం అపారం...సాయం స్వల్పం

Nov 8 2025 7:52 AM | Updated on Nov 8 2025 7:52 AM

నష్టం అపారం...సాయం స్వల్పం

నష్టం అపారం...సాయం స్వల్పం

నష్టం అపారం...సాయం స్వల్పం 33 శాతం నిబంధనతో...

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యవసాయశాఖ

‘‘తుఫాన్‌కు పంట దెబ్బతిని నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులు చెప్పిన మాటలు. అందుకు విరుద్ధంగా చేతలు ఉన్నాయి. నిబంధనల పేరుతో నష్టపోయిన రైతుల జాబితాకు కత్తెర వేశారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, నరసరావుపేట: మోంథా తుఫాన్‌ ప్రభావంతో గత నెల చివరలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ స్థాయిలో నష్టం చేకూరింది. జిల్లాలో వ్యవసా య, ఉద్యాన పంటలకు సంబంధించి సుమారు 25,859 హెక్టార్లకు పైగా దెబ్బతిన్నట్లు అధికారు లు ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. నిండా మునిగిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం స్వల్పంగా సాయం అందించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. నష్టం అపారంగా ఉండగా నిబంధనల పేరిట కనీసం పావు శాతం కూడా సాయం అందించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. తుఫాన్‌తో ఒకసారి మునిగిన రైతులను ప్రభుత్వం మరోసారి ముంచే ప్రయత్నం చేస్తోంది.

జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న పంట లెక్కించేందుకు ప్రభుత్వం జిల్లా, మండల, గ్రామస్థాయిలో నష్టం అంచనా కమిటీలను ఏర్పాటు చేసింది. నష్ట నమోదులో ప్రభుత్వం పెట్టిన మెలిక కారణంగా అర్హుల పేర్లు జాబితాలో లేకుండా పోయాయి. పంటలో 33 శాతం కన్నా ఎక్కువ నష్టపోతేనే పరిహారం జాబితాలో పేర్లు చేర్చారు. దీనికి ప్రామాణికం లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతలు సిఫార్సు లేకపోతే జాబితాలో పేర్లు తీస్తున్నారని రైతులు వాపోతున్నారు. మిర్చి లాంటి పంటలు 45 రోజులు దాటి పిందే, కాయ దశలో ఉంటేనే నష్ట నమోదు చేస్తున్నారు. కార్డులు లేవన్న సాకుతో కౌలు చేస్తున్న రైతుల పేర్లను జాబితాలో చేర్చడం లేదు. ఇలా ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధిత రైతుల జాబితా ను తగ్గించే ప్రయత్నం చేశారు. భారీ వర్షాలకు పత్తి పంట నాలుగు రోజుల పాటు నీటిలో ముంపునకు గురికావడంతో మొక్కలు కుళ్లిపోయిన దుస్థితిలో దర్శనమిస్తున్నాయి. చాలా వరకు చనిపోయాయి. ఇప్పటికీ మా పొలాలను అధికారులు సందర్శించి నష్టవివరాలను నమోదు చేయలేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో పత్తి, మిరప పంటలను కౌలు రైతులు సాగు చేస్తున్నారు. భారీ వర్షాలకు వారు నష్టపోయారు. ప్రభుత్వం కౌలు రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు.

మోంథా తుఫాన్‌తో తీవ్రంగా

నష్టపోయిన రైతులు

25,859 హెక్టార్లకుపైగా పంటలు

నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా

నిబంధనల పేరుతో భారీగా కోత

నిబంధనల మేరకే జాబితా

రూపొందించామంటున్న అధికారులు

1,312 హెక్టార్ల ఉద్యాన

పంటలకు నష్టం

167 హెక్టార్లలో నష్టం జరిగినట్లు

తుది జాబితా

జాబితాలో పేర్లు లేని రైతుల్లో ఆందోళన

వ్యవసాయ శాఖ

జాబితాలోనూ భారీగా కోత

వివరాలు చెప్పకుండా దాటవేస్తున్న

జిల్లా వ్యవసాయాధికారి

జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలు భారీ వర్షాలకు 1,312 హెక్టార్లలో నష్టపోయినట్టు ఆ శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది. తుది జాబితాలో కేవలం 167 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రకటించారు. ఇది ప్రాథమిక నష్ట అంచనాల్లో కనీసం 15 శాతం కూడా లేదు. ఇందులో మిర్చి 129.68 హెక్టార్లు, కూరగాయలు 29 హెక్టార్లు, బొప్పాయి 6.2 హెక్టార్లుగా ఉంది. మొత్తం 326 మంది ఉద్యాన రైతులకు రూ.55.41 లక్షల ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని రాష్ట్ర ఉద్యానశాఖ కార్యాలయానికి అంచనాలు పంపారు. మరోవైపు వ్యవసాయ శాఖ తీరు మరి ఘోరంగా ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం 24,547 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులు అత్యధికంగా వ్యవసాయ పంటలు తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయారు. ఆ శాఖ వద్ద నష్ట అంచనాల వివరాలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పల్నాడు లాంటి వ్యవసాయాధిరిత జిల్లాలో కీలకమైన వ్యవసాయశాఖ ఇలా పనిచేయడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని వాపోతున్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి జగ్గారావును అడుగగా నష్ట వివరాలు మొత్తం ఆన్‌లైన్‌లో నమోదవుతాయని, సుమారు 250 పేజీల రిపోర్ట్‌ను చెప్పడం కష్టమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement