కార్తిక స్నానాలకు సూర్యలంక తీరం ముస్తాబు
● నేటి నుంచి అనుమతి జారీ చేసిన కలెక్టర్ ● తీరంలో ఏర్పాట్లు పూర్తి
బాపట్లటౌన్: కార్తిక మాసంలో సూర్యలంక సముద్ర తీరంలో భక్తులు పుణ్య స్నానాలు చేయడం అనవాయితీ. ఈ ఏడాది మోంథా తుపాను కారణంగా ఈనెల 7 వరకు తీరంలోకి పర్యాటకులు వెళ్లకుండా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సముద్రంలో అలల తాకిడి తగ్గింది. తీర ప్రాంతాల్లో కోతకు గురైన ప్రాంతాన్ని చదును చేయడంతో పాటు పర్యాటకులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి తీరానికి అనుమతిస్తూ శుక్రవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేశారు. ఆర్డీవో గ్లోరియా మాట్లాడుతూ పర్యాటకులు, భక్తులు పోలీసుల ఆదేశానుసారం నిర్ణీత లోతులో మాత్రమే స్నానాలు చేయాలని చెప్పారు. తీరం వెంబడి పోలీసులు చేసే సూచనలను తప్పక పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన పర్యాటకులపై చర్యలు తీసుకుఉంటామని తెలిపారు.
పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి
డీఎస్పీ జి.రామాంజనేయులు మాట్లాడుతూ పర్యాటకులు అప్రమత్తంగా ఉండటంతో పాటు నియమ, నిబంధనలను పక్కగా పాటించాలని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులను తీరానికి తీసురాకూడదని చెప్పారు. మద్యం తాగి వచ్చినా, తీరంలోని అటవీ ప్రాంతాల్లో జంటలుగా సంచరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వన భోజనాలకు జీడి మామిడి
తోటలు అనుకూలం
భక్తులు స్నానాలనంతరం తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిమామిడి తోటలు, వన నర్సరీలోని నేరుడు చెట్లు వన భోజనాలు చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. నూతనంగా నగర వనం సిద్ధం చేశారు. వీటితో పాటు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో రిసార్ట్ అందుబాటులో ఉంది. భోజనాలు అనంతరం ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు కూడా అవకాశం ఉంది.
తాత్కాలిక గదుల ఏర్పాటు
తీరంలో మహిళలు దుస్తులు తాత్కాలిక గదులను ఏర్పాటుచేశారు. సముద్ర స్నానాల అనంతరం స్వచ్ఛమైన నీటితో చేసేందుకు జల్లు పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించుకునేందుకు తీరం వెంబడి తారకేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలు, నవ గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి.


