అనుమతులు లేని పాఠశాల మూసివేత
● పాఠశాలలో ఎంఈఓ తనిఖీలు
● విద్యార్థులను ఇళ్ల పంపిన అధికారులు
● అనుమతులు లేకుండా
నిర్వహిస్తే చర్యలు
వినుకొండ: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ పాఠశాలను మండల విద్యాశాఖాధికారి శుక్రవారం మూతవేయించారు. వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఓ పాఠశాల నడుపుతున్నారు. పాఠశాలకు పేరు కూడా లేకపోవడం గమనార్హం. పాఠశాల నిర్వాహకులు ఇతర దేశాల్లో ఉంటూ కొంత మంది ఉపాధ్యాయులను నియమించి తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో సుమారు 20 మంది విద్యార్థులు చదువుతుండగా, వారికి ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. అంగన్‌వాడీలో గుర్తింపు కూడా లేకపోవడం గమనార్హం. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే నిర్వాహకులు వారిని బెదిరించడం, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వినుకొండ విద్యాశాఖ అధికారి జఫ్రుల్లా శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నిర్వాహకులతో మాట్లాడి పాఠశాలకు ఎలాంటి గుర్తింపు లేదని, అనధికారికంగా పాఠశాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలలను ఆటోలో ఎక్కించి వారి స్వస్థలాలకు పంపించారు. ప్రభుత్వ అనుమతులు వచ్చిన తరువాతే పాఠశాలను నిర్వహించాలని, లేనిపక్షంలో మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా అనుమతులు లేకుండా ఇలాంటి పాఠశాలలను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హెచ్చరించారు.
అనుమతులు లేని పాఠశాల మూసివేత


