దేశ ఐక్యతా రాగం వందేమాతరం
కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట ఈస్ట్: భారతీయుల ఐక్యతా రాగం వందేమాతరం అని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. బంకిం చంద్ర చటర్జీ వందేమాతరం గీతం రచించి 150 వసంతాలను పురస్కరించుకొని శుక్రవారం శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో వందేమాతరం 150 వసంతాల సంబరాలను నిర్వహించారు. సంబరాలలో పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ దేశం కోసం పౌరులను త్యాగాలకు ప్రేరేపించేలా, ప్రతి ఒక్కరి బాధ్యతలను గుర్తు చేసేలా వందేమాతరం గీతం రచించారని అన్నారు. వందేమాతరం అంటే తల్లి దేశానికి వందనంగా పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు గర్వించేలా వందేమాతర గీతాలాపన చేయాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ వందేమాతరం ప్రాధాన్యతను వివరించారు. వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యతా యాత్రలో భాగంగా విద్యార్థులతో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. ఆయా కార్యక్రమాలలో డీఆర్‌ఓ మురళి, ఆర్డీఓ మధులత, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్రా వెంకటశివన్నారాయణ, జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశికుమార్, శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


