గురుకుల పాఠశాలను పరిశీలించిన మంత్రి డోలా
అమరావతి: స్థానికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను గురవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని వంట గది, మరుగు దొడ్లు, తరగతి గదులు పరిశీలించి విద్యార్థులను సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉమ్మడి జిల్లాకొక ప్రత్యేక వైద్యాధికారిని నియమించామని తెలిపారు.
గుంటూరు రూరల్: ఘన వ్యర్థాలను పర్యావరణహితంగా నిర్వహించడానికి, నగరాల్లో డంపింగ్ యార్డ్‌లు లేకుండా చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లు దోహదపడతాయని తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ) పి. మధుసూదన్‌రెడ్డి తెలిపారు. గురువారం గుంటూరు రూరల్ మండలం నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను నగర కమిషనర్ పి. శ్రీనివాసులుతో కలిసి ఆయన సందర్శించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ స్టడీ టూర్‌లో భాగంగా తమిళనాడు మున్సిపల్ విభాగం నుంచి గుంటూరు వచ్చిన డీఎంఏ, మదురై కార్పొరేషన్ కమిషనర్ చిత్ర విజయన్, హోసూర్ కార్పొరేషన్ ఈఈ విక్టర్ జ్ఞానరాజ్, ఏఈ (డీఎంఏ) రవి చంద్రన్‌లు ప్లాంట్, నగరంలోని ఎంఆర్‌ఎఫ్, వెట్, విండ్రో, వర్మి కంపోస్ట్ యూనిట్లను పరిశీలించారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జిందాల్ ప్లాంట్ నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ నోడల్ కార్పొరేషన్‌గా ఉండి, ప్రతి రోజు సుమారు నాలుగు వందల టన్నుల వ్యర్థాలను పంపుతున్నామన్నారు. దీని వలన గుంటూరు నగరంలో ఎక్కడా డంపింగ్ యార్డ్‌లు లేకుండా వీలు పడుతుందన్నారు.
గుంటూరు రూరల్: గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ నెల 11వ తేదీన గుంటూరు సమీపంలోని వెంగళాయపాలెం గ్రామంలోని మంచినీటి చెరువు వద్ద జరగనున్న జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమం, అమృత్ సరోవర్ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధులు రానున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్, ఎస్‌బీ సీఐ రాంబాబుతో ఎస్పీ సమావేశమై బందోబస్తును సమీక్షించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ బృందం భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రొటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.
కొల్లిపర: గుంటూరు జిల్లా మున్నంగి గ్రామం సమీపంలోని కృష్ణా నదిలో ఎటువంటి అనుమతులు లేకుండా గురువారం ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు వెళ్లే సమయానికి 9 ట్రాక్టర్లు ఇసుక లోడింగ్‌తో బయటకు రావటంతో వాటిని నిలిపి, ఎటువంటి అనుమతి పత్రాలు లేక పోవటంతో ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు కేసు నమోదు చేసి తహసీల్దారు జి.సిద్ధార్థ వద్దకు ట్రాక్టర్లను తరలించారు. తహసీల్దారు 9 ట్రాక్టర్లుకు రూ.5వేలు చొప్పున చలానా కట్టించారు. ఎటువంటి అనుమతులు లేకుండా నదిలో స్వేచ్ఛగా దిగి ఇసుక తరలించటం నేరం అని తెలిపారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.
గురుకుల పాఠశాలను పరిశీలించిన మంత్రి డోలా


