9న ఉపాధ్యాయ సాంస్కృతిక పోటీలు
నరసరావుపేట: పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన పట్టణంలోని పల్నాడు రోడ్డులో గల ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలలో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సాంస్కతిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు గురువారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను వారి వారి కార్యాలయాల్లో కలసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. బాలోత్సవం అధ్యక్షుడు, ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో పల్నాడు బాలోత్సవానికి ప్రత్యేకత ఉందన్నారు. ఉపాధ్యాయులు కూడా బోధనకే పరిమితం కాకుండా సృజనాత్మకత చాటేలా, పిల్లలను అర్థం చేసుకునేలా తీర్చిదిద్దడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వివరాలకు 98665 62260, 99498 09821 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కమిటీ సభ్యులు కోరారు.
పెదకాకాని: ప్రపంచ తెలుగు బాలల పండుగ వీవీఐటీయూ బాలోత్సవ్ – 2025 సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో సర్వం సిద్ధం చేశామని చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూలో గురువారం ఆయన మాట్లాడుతూ.. 20 అంశాలు, 61 విభాగాలలో పోటీలు నిర్వహించేందుకు 32 వేదికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వసతి కోసం 73862 25336 ఫోను నంబరును సంప్రదించాలన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల విద్యార్థులకు 43 రూట్లలలో బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
గుంటూరు రూరల్: పద్మవిభూషణ్ ఆచార్య ఎన్.జి. రంగా 125వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నగర శివారులోని లాంఫాం నందున్న ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కృష్ణ ఆడిటోరియంలో వేడుకలు నిర్వహించనున్నారు. ఆచార్య ఎన్.జి.రంగా ట్రస్ట్ సభ్యులు రామినేని కిషోర్‌బాబు, టి.యుగంధర్, బి.నాగేశ్వర్‌మిత్రలు గురువారం ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


