మూడు మండలాల్లోనే వర్షం
నరసరావుపేట: గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలోని 28 మండలాల్లో కేవలం మూడు మండలాల్లో 4.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు రెవెన్యూ అధికారులు గురువారం వెల్లడించారు. నాదెండ్లలో 2.0, చిలకలూరిపేట 0.2, యడ్లపాడు 2.4 వర్షం కురిసిందన్నారు.
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : జిల్లాలోని వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వర్తించే ఒక ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ , హోంగార్డులను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంపాలెం ఎస్‌ఐ షేక్.సలాం, హెచ్‌సీ బి.రమేష్, పెదకాకాని కానిస్టేబుల్ బి.సురేష్‌కుమార్, హోంగార్డు హరీష్‌ను సస్పెండ్ చేశామన్నారు. ఎస్‌ఐ, హెచ్‌సీలు అధి కారిక విధుల్లో ప్రైవేట్ వ్యక్తులను అనుమతించి, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు వెల్లడైందని అన్నారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వ్యక్తుల నుంచి రూ.3 వేలను కానిస్టేబుల్, హోంగార్డు తీసుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): క్రీడా మైదానాలు చిన్నారులతో కళకళలాడినప్పుడే ఆరోగ్యకరమైన ఆధునిక సమాజాన్ని చూడగలుగుతామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. గుంటూరు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్స్ ఫెన్సింగ్ యువతీ యువకుల విభాగంలో పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అఫ్రోజ్ మాట్లాడుతూ క్రీడా సంఘాలు క్రమం తప్పకుండా పోటీలు నిర్వహిస్తే ఎందరో ప్రతిభ ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ చైర్మన్ క్రిష్టోఫర్ మాట్లాడుతూ పోటీల్లో విజయ సాధించిన యువతీ యువకులు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉమెన్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.స్వర్ణలతదేవి, టెక్నికల్ అఫీషియల్ ఖేలో ఇండియా కోచ్ చిరంజీవి, అఫ్రోజ్ ఖాన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్టేడియం ఫెన్సింగ్ కోచ్ సంగీత్ బాబు, కార్యదర్శి అశోక్‌బాబు పాల్గొన్నారు.


