ప్రజా సంకల్ప యాత్రకు ఎంతో ప్రత్యేకత
వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల: దేశ చరిత్రలోనే 8 సంవత్సరాల క్రితం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టి, వారి సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ఆదరణ పొందిన జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప యాత్ర 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కార్యకర్తలు, నాయకులతో సమావేశం అయ్యారు. ఇలాంటి యాత్ర దేశ చరిత్రనే మార్చివేసిందన్నారు. యాత్ర చేసి అత్యధికంగా సీట్లు పొంది ఎప్పుడూ బడుగు, బలహీన వర్గాల వైపే తామున్నామని నిరూపించుకున్న నేత వైఎస్ జగన్ అన్నారు. 8 ఏళ్ల క్రితం 3,468 కి.మీ.ల దూరం ప్రజా సంకల్పయాత్ర చేసి నియోజక వర్గాలలో బహిరంగ సభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహించారన్నారు. అధికారంలో ఉన్నా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ఆనాడు సంకల్ప యాత్రకు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారన్నారు. రాబోయే రోజుల్లోనూ ప్రజల కోసం మాజీ సీఎం జగన్ ఇలాంటి మరిన్ని యాత్రలు నిర్వహిస్తూనే ఉంటారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు మద్దతు పలకాలని కోరారు.


