
తాళం వేసిన ఇంట్లో చోరీ
రెండు సవర్ల బంగారు ఆభరణాలు మాయం!
యడ్లపాడు: మండలంలోని కోట గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంటి యజమాని ఊరు వెళ్లిన సమయంలో దుండగులు చొరబడి సుమారు బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోట గ్రామానికి చెందిన షేక్ ఖైరున్నీసా ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం నరసరావుపేటలోని తన కోడలి ఇంటికి వెళ్లింది. రెండురోజుల తర్వాత 18వ తేదీ సాయంత్రం కోట గ్రామానికి తిరిగి రాగా ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గుర్తించింది. 12 గ్రాముల బంగారు గొలుసు, 4 గ్రాముల చెవిదుద్దులు, వెండిపట్టీలు, ఇత్తడి సామగ్రి అపహరణకు గురైనట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేశారు. వెంటనే క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని, ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తెలిపారు.
పిచ్చికుక్క స్వైర విహారం
15 మందికి గాయాలు
గురజాల: పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 15 మందిని గాయపర్చింది. నగర పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం రోడ్డులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పిచ్చి కుక్క కనిపించిన వారిని కనిపించినట్లు కరుస్తూ వెళ్తుంది. కుక్క దాడిలో 15 మందికి గాయాలు కాగా గురజాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రంకు వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. నగర పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి కుక్కలను పట్టించి అడవిలో వదిలి వేయాలని కోరుతున్నారు. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
అనాథ యాచకుడి అంత్యక్రియలు
మాదల(ముప్పాళ్ళ): మండలంలోని మాదల గ్రామం వద్ద మృతి చెందిన యాచకుడికి పంచాయతీ, పోలీసు సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఆలేటి యాదగిరి(46) అనే దివ్యాంగుడు సుమారు 25 సంవత్సరాల క్రితం మాదల గ్రామానికి వచ్చి దేవుడు గుడి, సమీపంలోని పాఠశాలల వద్ద ఉంటూ వారిచ్చే ఆహారం తింటూ జీవనం సాగిస్తుండేవాడు. యాదగిరికి రెండు చేతులు సరిగ్గా ఉండవు. దివ్యాంగుడు కావటంతో స్థానికులు కూడా ఆహారం అందించేవారు. ఈక్రమంలో ఆదివారం సత్తెనపల్లి – నరసరావుపేట ప్రధాన రహదారి పక్కనే ఉన్న సత్రం గోడ వద్ద యాదగిరి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు జవంగుల సాంబశివరావు సత్రం లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కొద్దిసేపటికి యాదగిరి మృతి చెందటంతో సమాచారాన్ని పోలీసులకు అందించారు. పంచాయతీ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో యాదగిరికి అంత్యక్రియలు నిర్వహించారు.
చీరాల: తెలుగు సినిమా చరిత్రలో ‘ఘంటసాల ది గ్రేట్’ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ సినిమా డైరెక్టర్ సీహెచ్. రామారావు అన్నారు. చీరాలలోని మోహన్ థియేటర్‌లో ఆదివారం ప్రదర్శించిన ప్రివ్యూ షో సంగీత అభిమానులను ఆకట్టుకుంది. చీరాలలో డైరెక్టర్ సీహెచ్. రామారావు అభిమానులతో కలిసి సినిమా తిలకించారు. ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒక గాయకుడిపై తీసిన అరుదైన సినిమా‘ ఘంటసాల ది గ్రేట్ ’ అని పేర్కొన్నారు. ఒక తరం సంగీతానికి ప్రాణం పోసిన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 12న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోట వెంకటేశ్వరరెడ్డి, గాదె వెంకటరెడ్డి, గాదె హరిహరరావు, పాలెపు కనక మోహనరావు, రాజ్ వినయ్‌కుమార్, నాగవీరభద్రాచారి, ఏకాంబరేశ్వరబాబు, వీరనారాయణ, హరిహరరావు, రామారావు, రాజ్యలక్ష్మి, సునీత, రంగారావు పాల్గొన్నారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ