
బలం లేకున్నా బరితెగింపు
ఎంపీపీ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ సభ్యులకు బెదిరింపులు, ప్రలోభాలు 28న బలనిరూపణకు రంగం సిద్ధం
ఎంపీపీ పదవి కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంపీటీసీ సభ్యులను బెదిరిస్తున్నారు. కాంట్రాక్టులు ఆశ చూపుతూ, రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఒక్కొక్కరికి ఇస్తామని ప్రలోభాలకు తెరదీస్తున్నారు. ఇప్పటికే ఇరువురు ఎంపీటీసీ సభ్యులకు చెందిన వ్యాపారాలపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి కేసులనూ తొలగిస్తామని చెబుతున్నారు.
ముప్పాళ్ళ: ఎంపీపీ పదవిపై అవిశ్వాస తీర్మానం కోరేందుకు కనీసం ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాల్సి ఉంది. మండలంలో 12 మందికిగాను 11 మంది వైఎస్సార్‌సీపీ వారే ఉన్నారు. ఒక్క స్థానంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు. నామమాత్రంగా కూడా టీడీపీ బరిలో నిలిచింది లేదు. అలాంటి సమయంలో ఆరుగురు సభ్యులకు కండువా కప్పి టీడీపీ సభ్యులుగా చెప్పుకొంటున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఎనిమిది మంది సభ్యులు అవసరమైతే, అందులో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ బాధితులే బహిరంగంగా ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేలా అధికారులు నోటీసులు అందించారు. ఎనిమిది మంది సభ్యులు సమావేశం రోజున ఆర్డీవో ఎదుట హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా మద్దతు తెలపాల్సి ఉంటుంది. అప్పుడు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం అంగీకరిస్తూ సమావేశాన్ని ముగిస్తారు. కండువా మార్చిన ఎంపీటీసీ సభ్యులలో ఒకరిని ఎన్నుకుంటారు. అయితే కండువా మార్చిన వారిలో ఒకరు తనకు ఎంపీపీ పదవి ఇస్తేనే మద్దతు తెలుపుతానని చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ అభ్యర్థికి సీనియర్ నాయకుల అండ ఉందని సమాచారం. ఈ వివాదం నియోజకవర్గ నేత వద్దకు వెళ్లగా అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడదామని చెప్పినట్లు తెలిసింది. జనసేన అభ్యర్థి కూడా ఎంపీపీ పదవి కోరగా, టీడీపీ నాయకుడు తిరస్కరించినట్లు సమాచారం.